హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కిషన్ రావులతో కలిసి డిప్యూటీ సీఎం గ్యాస్, పెట్రోల్ సరఫరాలను బుధవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసే దాని కంటే, ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీ లను ఆదేశించారు.

ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి రెగ్యులర్ గా ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులని భట్టి ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీ లకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్లు వీసీ సజ్జన్నార్, జి. సుధీర్ బాబులతోపాటు, IOCL, HPCL, BPCL ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
పారిపోయిన బీఆర్ఎస్: అసెంబ్లీలో భట్టి

కాగా రాష్ట్రంలోని పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వినడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మనసు లేదని, అందుకే బడ్జెట్ సమాధానం వినకుండా సభ నుంచి పారిపోయారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీలో ‘ప్రశ్నోత్తరాల సమయం’లో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
”గత పాలకులు మాయమాటలు చెప్పి, ప్రజల్లో భ్రమలు కల్పించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకున్నారు. కానీ, పదేళ్ల అధికారంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వకుండా వారిని గాలికి వదిలేశారు” అని భట్టి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉన్నత లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అదే స్ఫూర్తితో నేడు తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.
బడ్జెట్ ప్రతులను చింపి, చెవిలో పెట్టుకుని వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడే అర్హత లేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. “పేదలు ఇల్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతకడం విపక్షాలకు ఇష్టం లేదు. బడ్జెట్లో నిధులు తగ్గించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏకంగా ₹22,500 కోట్లు కేటాయించాం” అని భట్టి స్పష్టం చేశారు.

