Top 5 This Week

Related Posts

ఎంత మందిని తొక్కుతవ్..? రేవంత్ పై జీవన్ రెడ్డి నిప్పులు

జగిత్యాల: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని బండారి గార్డెన్స్ లో తన అనుయాయుల, అభిమానుల, అనుచరుల, కార్యకర్తలతో సమావేశమైన జీవన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గడచిన 20 మాసాలుగా తనను కించపరుస్తు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారన్నారు. పదవులు ఇవ్వకపోయినా ఫరవాలేదు, కానీ కార్యకర్తల ఆత్మగౌరవమైనా కాపాడాలి కదా? అని ప్రశ్నించారు. పార్టీలో ఎం నడుస్తోంది? ఏ మౌతుంది? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసిన తాను మంత్రిపదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించారు. పదవుల కోసమే అయితే ఆనాడే తాను ప్రొటెక్ట్ చేసేవాడిననని పేర్కొన్నారు.

సభా వేదికపై జీవన్ రెడ్డికి జై కొడుతున్న అనుచరులు

మీ అడుగులకు మడుగులొత్తేవారికే పదవులు ఇస్తారా? అని సీఎంను ప్రశ్నించారు. బతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవినిస్తారా? ప్రభుత్వానికి పోచారం ఇచ్చిన సలహాలేమిటి? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డి ఎవరని కూడా ప్రశ్నించారు. అతని సలహాలతోనే ప్రభుత్వం నడుస్తోంది కదా? అతనికే మళ్లీ రాజ్యసభ పదవి దేనికని జీవన్ రెడ్డి నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ప్రత్యేక పరిస్థితుల్లో వెనక్కి తీసుకుని, న్యాయం చేస్తామని చిన్నారెడ్డికి హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ నాయకుని పరిస్థితి ఏమిటన్నారు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని చిన్నారెడ్డి చేసిన ప్రకటన తనను బాధించిందన్నారు. అదేవిధంగా పదవులు పొందడానికి మధుయాష్కీ, హనుమంతరావు వంటి సీనియర్లు పార్టీలో లేరా? అని జీవన్ రెడ్డి అన్నారు.

జీవన్ రెడ్డిని అణగదొక్కాలన్నదే మీ ఆలోచన కావచ్చు.. నాడు చంద్రబాబుతో, కేసీఆర్ తో పోరాటం చేశానని, నేడు రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇంకా ఎంతకాలం అవమానాలను, మానసిక క్షోభను అనుభవించాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోళ్లను అణగదొక్కుతున్నావ్? కార్యకర్తలను గౌరవించడం నేర్చుకో.. నా జీవితంలో చివరి పోరాటం.. అని జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టామని, ధర్మపోరాటమే తన లక్ష్యమని జీవన్ రెడ్డి అన్నారు. తన పోరాటంలో తనతో కలిసి వచ్చేవారు చేతులు ఎత్తాలని జీవన్ రెడ్డి కోరగా, హాజరైనవారందరూ సుముఖత తెలుపుతూ చేతులు ఎత్తడం విశేషం.

ఇదిలా ఉండగా సభ ముగిసిన అనంతరం కొన్ని న్యూస్ ఛానళ్లతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల నుంచి తనకు పరోక్ష ఆహ్వానం ఉందని, అయితే తాను ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో చేరేది లేదన్నారు. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతాంగ సమస్యలపై పోరాటం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు, ధరణి పోర్టల్ సమస్యలు లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పోరాడుతానని జీవన్ రెడ్డి వెల్లడించారు.

కాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జీవన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపిన లేఖ ప్రతిని దిగువన చూడవచ్చు..

Popular Articles