Top 5 This Week

Related Posts

బడ్జెట్ పై ఖమ్మంలో డిప్యూటీ భట్టి సీఎం కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో పుట్టడం, జీవించడం అదృష్టంగా ప్రజలు భావించే విధంగా బడ్జెట్ లో సమతుల్యతను పాటించామన్నారు. పుట్టినప్పటి నుంచి చివరి వరకు తమను రక్షించే విధంగా ఏదో ఒక పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తోందనే నమ్మకాన్ని, భరోసాను కల్పించే విధంగా బడ్జెట్ ను రూపొందించామనన్నారు. అంతిమంగా ఇది ‘పీపుల్స్ బడ్జెట్’ అని భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆదివారం రాత్రి ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

ప్రజల జీవనస్థితిగతులను మెరుగుపరిచే పథకాలను రూపొందించామని భట్టి పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. మన పిల్లలే రేపటి సంపద, వారి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావించి వారంలో ఆరు రోజులు పౌష్టిక ఆహారాన్ని అందిస్తామన్నారు. యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారం వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తామని, ఈ సంవత్సరం కూడా నియోజకవర్గానికి 1,000 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తున్నాట్లు ప్రకటించారు.

అదేవిధంగా పని లేని వారికి పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఉద్యోగస్తుల కుటుంబాలకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులు, ప్రభుత్వ ఉద్యోగికి ప్రమాదం జరిగితే 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమాను ప్రకటించామన్నారు. ప్రపంచీకరణకు అనుగుణంగా మన బిడ్డలకు నైపుణ్యం నేర్పేందుకు స్కిల్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను నెలకొల్పుతున్నామని, ఈ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు 2,000 రూపాయల స్కాలర్ షిప్ ను అందించబోతున్నామని భట్టి వివరించారు.

విదేశాల్లో మన బిడ్డలకు ఉపాధి కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ సంవత్సరం కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 14 వేల బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి హామ్ మోడల్ ద్వారా రూ. 13,500 కోట్లు కేటాయించామన్నారు. జీడీపీలో దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని తీసుకువచ్చామన్నారుే. గిరిజనుల భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు 100% సబ్సిడీతో ఇందిరా సౌర గిరి జల వికాసం. 6.70 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాబోతున్నామన్నారు.

సన్నధాన్యం సాగుచేసిన రైతులకు బోనస్ రూపంలో రెండు సీజన్లో ఒక్కో ఎకరాకు 25 వేలు జమ అయినట్లు చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం 14 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందన్నారు. మన యూనివర్సిటీలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1,000 కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ. 400 కోట్లు కేటాయించామన్నారు. యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు కేటాయించామని చెప్పారు.

చరిత్రలో మొదటిసారి గోదావరి పుష్కరాలకు రూ. 440 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పనులు ప్రారంభించామని, బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నాట్లు చెప్పారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు. కాగా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి ఆదివారం విస్తృతంగా పర్యటించారు.

బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అదేవిధంగా సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ఐటిఐ భవనాలను పరిశీలన చేశారు. ఆత్కూరులోని అగ్నిప్ర‌మాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని ప‌రిశీలించారు.

Popular Articles