ఖమ్మం: వెలుగుమట్ల కూల్చివేత బాధితుల్లో అర్హులైనవారికి బుధవారం పంపిణి చేసే ఇంటి స్థలం పట్గాలకు సంబంధించిన భూమి ఏ ప్రాంతంలో ఉంది? ప్రభుత్వం ఏ స్థలాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది? ఇదీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గత నెల 24వ తేదీన ఇండ్లు కూల్చేసిన అంశంలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఆరోపణలను, విమర్శలను మూటగట్టుకుందనే అంశం నిర్వివాదం. రాజకీయంగా పూడ్చుకోలేని స్థాయిలో నష్టం అప్రతిష్టను మూటగట్టుకున్న ఈ ఘటనలో ప్రస్తుతం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. ఈమేరకు బుధవారం దాదాపు 350 మందికి ఇంటి స్థలాల పట్టాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పంపిణీ చేస్తారని అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది.
అయితే ఇంతకీ వెలుగుమట్ల బాధితులకు ఇంటి స్థలాన్ని ఎక్కడ కేటాయిస్తున్నారనేదే అసలు చర్చగా మారింది. ‘సమీక్ష’ న్యూస్ సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఎక్కడైతే ఇళ్లను కూల్చాలరో.. అదే ప్రదేశంలోనే అర్హులైన పేదలకు ఇంటి స్థలం పట్టాలను అందించనున్నారు. మొత్తం 9.00 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 350 మందికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ఇంటి స్థలం పట్టా కాగితాలను ప్రదానం చేయనున్నారు. ప్రతి లబ్ధిదారునికి 75 చదరపు గజాల విస్తీర్ణపు స్థలాన్ని కేటాయిస్తూ పట్టా కాగితాలు తయారైనట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయం అధికారికగా ధ్రువపడాల్సి ఉంది.

Update:
కాగా ఈ అంశంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయం మంగళవారం రాత్రి 8.17 గంటల ప్రాంతంలో అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. వెలుగుమట్ల భూముల్లో కూల్చివేత బాధితులకు కేవలం స్థలమే కాకుండా, ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా మంజూరైనట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా 311 మందికి ఇంటి స్థలం లేని వారికి ‘పట్టా’తో పాటు ‘ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం’ ఇస్తారని తెలిపింది. అదేవిధంగా మరో 101 మందికి ఇప్పటికే స్థలం ఉన్నందున వారికి నేరుగా ‘ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం’ అందజేస్తారని పేర్కొంది. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ యోగం కలగబోతోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయం ప్రకటించింది.

