Top 5 This Week

Related Posts

‘వెలుగుమట్ల’ బాధితులకు శుభవార్త

ఖమ్మం: నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అర్హులైప బాధితులకు ప్రభుత్వం బుధవారం ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేయనుంది. ఈమేరకు అధికారిక కార్యక్రమం ఖరారైంది. డిప్యైటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బుధవారం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల మధ్య జిల్లా కలెక్టరేట్ లో వెలుగుమట్ల కూల్చివేతల నిర్వాసితులకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ, బుధవారం సాయంత్రానికి ఈ అంశంలో ఆయన అధికారిక పర్యటన షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు.

కూల్చివేతల తర్వాత వెలుగుమట్ల భూముల దృశ్యం (File Photo)

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గల సుమారు 700 ఇండ్లను అధికార యంత్రాంగం గత నెల 24వ తేదీన కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వెలుగుమట్లలో అసలైన పేదలను గుర్తించే ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించింది. సుమారు 24 మంది తహశీల్దార్లు సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులను, స్థానికేతరులను, అర్హులను ఈమేరకు గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు 350 మంది అర్హులను ఇంటి స్థలాల లబ్ధిదారులుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే వీరందరికీ ఏ ప్రాంతంలో ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారనే విషయం మాత్రం బహిర్గతం కాలేదు. అర్హుల జాబితాను కూడా బుధవారం రాత్రి 7.00 గంటల వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. రేపటి కార్యక్రమంలోనే అర్హుల జాబితాను వెల్లడించి, అప్పటికప్పుడు వారికి ఇంటి స్థలాల పట్టాలను మంత్రులే స్వయంగా పంపిణీ చేస్తారని అధికార వర్గాలు చెప్పాయి.

Popular Articles