Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

అప్పుడే నియంత్రించి ఉంటే.. ఇప్పుడీ ‘అభిశంసన’ ఉండేదా!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
‘అభిశంసన’ (Impeachment).. నిజానికిది చాలా లోతైన నిర్వచనపు పదం. సాధారణంగానైతే రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో గలవారు, అధికారులు రాజ్యాంగ ఉల్లంఘనకు, తీవ్ర నేరాలకు పాల్పడినపుడు విచారణలో దోషులుగా తేలితే, ఆయా వ్యక్తులను పదవి నుంచి తొలగించేందుకు చట్టసభల ద్వారా చేపట్టే ఓ అధికారిక ప్రక్రియ. ఇప్పుడీ ‘అభిశంసన’ అనే పదానికి సంబంధించిన ప్రాసెస్ ను తెలంగాణా కమ్యూనిస్టు రాజకీయాల్లోనూ సమీక్షించాల్సిన పరిణామం ఏర్పడడమే అసలు విశేషం.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ సుపరిచితుడైన కాకలు తీరిన మార్క్సిస్టు నేత, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తీరును అభిశంసిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీకి లేఖ రాయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. తమ్మినేని హయాంలో తీవ్రమైన నిర్మాణ అనైక్యతను, ముఠా తత్వాన్ని, ప్రమాణాల ఉల్లంఘనను, కొనసాగుతున్న అస్తిత్వవాద రాజకీయ ప్రభావాన్ని, తప్పుడు రాజకీయ ధృక్పథాన్ని, ఫెడరల్ ధోరణులను, తరిగిపోయిన పార్టీ విలువలను కేంద్ర కమిటీ తన అభిశంసన లేఖలో ప్రస్తావించింది.

2008లో ‘వాస్తవికవాదులు’ ప్రచురించిన ‘నిప్పుకు చెదలు’ పుస్తకం కవర్ పేజీ

ఈ అంశంలో కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, బి. ప్రసాద్ లు ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని కూడా పార్టీ స్పష్టం చేసింది. వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని భావించిన కేంద్ర కమిటీ, నిర్మాణానికి సంబంధించి తగనివిధంగా ప్రవర్తించిన ఆయా ముగ్గురు కామ్రేడ్స్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుందని, వారిని అభిశంసించిందని వెల్లడించింది. అంతేగాక తమ్మినేని వీరభద్రాన్ని రాష్ట్ర సెక్రటేరియట్, కమిటీ సమావేశాల్లో పరిశీలకునిగా నడుచుకోవాలని, రాష్ట్ర సెక్రటేరియట్ డైరెక్షన్ లో పనిచేయాలని కూడా కేంద్ర కమిటీ ఆదేశించింది. వీరభద్రంతోపాటు మిగతా ఇద్దరు నాయకులు తమ పొరపాట్లను గుర్తించి, సరిచేసుకునేందుకు దోహదపడుతాయన ఉద్ధేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కూడా సీపీఎం కేంద్ర కమిటీ వివరించింది.

అయితే పార్టీ కేంద్ర కమిటీ తన లేఖ ద్వారా వీరభద్రాన్ని అభిశంసించిన తాజా పరిణామాల్లో సరిగ్గా పదిహేడున్నర సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఓ పరిణామం మళ్లీ తెరపైకి చర్చగా వచ్చింది. ‘వాస్తవికవాదులు’ పేరుతో కొందరు సీపీఎం నాయకులు 2008 జూలైలో ‘నిప్పుకు చెదలు’ (తమ్మినేని నిర్వాకం) శీర్షికన సంచలన పుస్తకాన్ని విడుదల చేసిన ఉదంతం ఇప్పుడు మళ్లీ రాజకీయ చర్చకు దారి తీసింది. ఖమ్మం సీపీఐ (యం) పేరునే పుస్తకం కవర్ పేజీపై పేర్కొంటూ 60 పేజీల పుస్తకాన్ని ప్రచురించి పంపణీ చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. అనేక మంది మంది నాయకుల, కార్యకర్తల త్యాగాలు, రక్తతర్పణంతో పునీతమైన పార్టీ స్వార్థపరుల, సంకుచిత, ప్రయోజనాలకు బలి అవుతున్నదని పుస్తకాన్ని ప్రచురించిన సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ్మినేని వీరభద్రం (ఫైల్ ఫొటో)

ఈ పుస్తక ప్రచురణకర్తల్లో అప్పటి సీపీఎం ఖమ్మం జిల్లా నాయకులు వనం నర్సింగరావు, వై. వినయ్ కుమార్, సింగు నరసింహారావు, రాయల వెంకటేశ్వర్లు, కిలారు సీతారాములు, ఎర్రబోయిన సీతారాములు, నల్లపునేని అప్పారావు, జొన్నలగడ్డ రవికుమార్, ఇలవల పుల్లారెడ్డి, ఎడవల్లి రాంరెడ్డిలు ఉండగా, దీని వెనుక టీఎస్ ప్రసాద్, ధనాల కొండయ్య వంటి ముఖ్య నాయకులు ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆయా నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు. వీరిలో టీఎస్ ప్రసాద్ వంటి ఒకరిద్దరు నాయకులు వేర్వేరు సందర్భాల్లో, ఘటనల్లో మరణించగా, మరికొందరు కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ వంటి పార్టీల్లో రాజకీయ నేతలుగా కొనసాగుతున్నారు.

‘నిప్పుకు చెదలు’ పుస్తకంలో ఆదర్శమూర్తులుగా చిర్రావూరి లక్ష్మానారాయణ, మంచికంటి రాంకిషన్ రావు, శేషగిరిరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, రావెల్ల సత్యానారాయణ, టీీవీఆర్ చంద్ర, బోజెడ్ల వెంకటనారాయణ, ఏలూరి లక్ష్మీనారాయణ, బండారు చంద్రరావు, గండ్లూరి కిషన్ రావు, బాజి హన్మంతు, ఎడవల్లి పద్మారెడ్డి తదితర నాయకుల సేవలను, చరిత్రను ప్రచురణకర్తలు గుర్తు చేశారు. ‘తమ్మినేని నాయకుడైన తీరు, తమ్మినేని వ్యక్తిత్వం, ముదిగొండ ఘటనలు, పాలేరు డివిజన్ లో ఏం జరిగింది? జిల్లాలో పరిణామాలు వంటి పలు శీర్షికలతో రాసిన వ్యాసాల్లో అనేక అంశాలను తమదైన రీతిలో లోతుగానే పార్టీ శ్రేణుల, ప్రజల ముందుంచారు.

ఇదే దశలో పార్టీకి చెందిన ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుకు, జాతీయ కార్యదర్శి ప్రకాష్ కరత్ వంటి పలువురు నాయకులకు రాసిన లేఖల్లోని పాఠాన్ని కూడా పుస్తకంలో ఉటంకించారు. అయితే ఈ పరిణామాల్లో అప్పటి సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు తమ్మినేని వీరభద్రానికి కితాబునివ్వడం ఈ సందర్బంగా గమనార్హం. తమ్మినేని వీరభద్రం ‘బంగారం’ వంటి నాయకుడని బీవీ రాఘవులు వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించిన పరిస్థితుల్లో ‘నిప్పుకు చెదలు’ పుస్తకం తాజాగా మళ్లీ చర్చకు దారి తీయడమే అసలు విశేషం.

తమ్మినేని పాదయాత్ర నిర్వహించినప్పటి చిత్రం (ఫైల్)

కానీ ఈ అంశంలో చెప్పొచ్చేదేమిటంటే.. తమ్మినేని వీరభద్రాన్ని కేంద్ర కమిటీ అభిశంసిస్తే అభిశంసించి ఉండవచ్చుగాక.. కానీ పార్టీకి తమ్మినేని చేసిన సేవలు, పార్టీ పురోగతికి ఆయన శ్రమించిన తీరును సీపీఎం శ్రేణులే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా మర్చిపోలేని అనేక ఘటనలు చరిత్రాత్మకంగా లిఖించబడ్డాయనేది కాదనలేని అంశం. ముఖ్యంగా గోదావరి జలాలను పాలేరుకు అనుసంధానం చేయాలంటూ సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం దుమ్ముగూడెం నుంచి పాలేరు నియోజకవర్గం వరకు వంద రోజులపాటు 2,792 కి.మీ. పాదయాత్ర చేయడం ద్వారా తమ్మినేని వీరభద్రం తనదైన చరితను లఖించుకున్నారని చెప్పక తప్పదు. ఇదే దశలో తమ్మినేని క్రిష్ణయ్య హత్యోదంతం ఘటనలో ఆయన సోదరుడు కోటేశ్వర్ రావు, పార్టీకి చెందిన మరికొందరు నిందితులుగా ఉండడం కూడా మర్చిపోలేని ఘటనగానే మిగిలిపోవచ్చు.

ఇటువంటి అనేక పరిణామాల రాజకీయ చరిత్రను సముపార్జించుకుని, 72 ఏళ్ల వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమ్మినేని వీరభద్రంపై ఈ దశలో ‘అభిశంసన’ సమసంజమేనా? అనే ప్రశ్న కూడా రాజకీయ పరిశీలకుల్లోనే కాదు, పార్టీ కేడర్ లోనూ రేకెత్తుతోంది. ‘కమ్యూనిస్టు’ పరిభాషలో అభిశంసన అంటే ఓ హెచ్చరిక లాంటిది. తప్పులను గుర్తించడం, చర్చించడం, ఆత్మవిమర్శ చేసుకోవడం ఎర్ర పార్టీల్లో సహజమే కావచ్చు. కానీ తమ్మినేని వీరభద్రం ద్వారా జరిగినట్లు కేంద్ర కమిటీ భావిస్తున్న తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆయన నీడ లేకుండా సీపీఎం కేంద్ర కమిటీ రాష్ట్రంలో పార్టీని ముందుకు నడపగలదా? అనే ప్రశ్నపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా ‘నిప్పుకు చెదలు’ శీర్షికతో పుస్తకం వెలువడిన కాలంలోనే పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని, తప్పొప్పులను గుర్తించి, తమ్మినేని వీరభద్రాన్ని అప్పట్లోనే కాస్త నియంత్రించి ఉంటే సీపీఎం రాజకీయ చరిత్రలో ప్రస్తుతం ‘అభిశంసన’ అనే పదానికి స్థానం ఉండేదా? అనే ప్రశ్నకు కూడా ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర కమిటీ వద్ద సమాధానం లభించకపోవచ్చు. అదీ అసలు విషయం.

Popular Articles