Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

తెలంగాణా ఉద్యోగులకు, గ్రామ పంచాయతీలకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల మంజూరు కోసం రూ. 745 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈ నిధులు విడుదలైనట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోందని, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్ లో నిధులను విడుదల చేస్తోందని ఆ ప్రకటన పేర్కొంది.

ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని ప్రకటన పేర్కొంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ నిధులు విడుదల చేశారు. ఉద్యోగులకు ప్రతినెల రూ. 700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు గత జూన్ నెలాఖరులో రూ. 183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ .700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదలైన బిల్లులో గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి.

అదేవిధంగా గ్రామపంచాయతీలకు కూడా సర్కార్ శుభవార్తను వినిపించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు గ్రామ పంచాయతీలకు రూ. 389 కోట్ల నిధులను విడుదల చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్ లో జరిగే తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. భట్టి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.

Popular Articles