Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ పేరు ఖరారు!

(సమీక్ష ప్రత్యేకం)
భద్రాద్రి జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ గా దొడ్డా కిరణ్ మిత్ర పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు తెలిసింది. వైస్ చైర్మెన్ పదవిని మైనారిటీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. సోమవారం జరగాల్సిన ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యంగా వాయిదా పడింది. క్యాంపునకు తరలివెళ్లిన మొత్తం 21 మంది కౌన్సిలర్లు నిర్దేశిత సమయానికి ఇల్లెందుకు చేరుకోలేకపోయారు. దీంతో ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక రేపటికి వాయిదా పడింది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు కారణాలపై 11 మున్సిపాలిటీల్లో పాలకవర్గం ఎన్నిక వాయిదా పడింది. అందులో ఇల్లెందు మున్సిపాలిటీ కూడా ఉంది. వాయిదా పడిన మిగతా మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్పం, సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఖానాపూర్, జహీరాబాద్, క్యాతనపల్లి, డోర్నకల్, ఇంద్రేశం, తొర్రూర్, జనగామ వంటి మున్సిపాలిటీల్లో వాయిదాకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిచోట్ల కోరం లేక, మరికొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో ఓటు వివాదం, ఉద్రికత్త వంటి పలు కారణాలు ఉన్నాయి.

కానీ ఇల్లెందులో అటువంటి కారణమేదీ లేకుండా ఎన్నిక వాయిదా పడడానికి క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు ఆలస్యంగా చేరుకోవడమే ప్రధాన కారణం. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలర్లు తాపీగా ఇల్లెందుకు చేరుకోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ గా దొడ్డా కిరణ్ మిత్ర పేరును పార్టీ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ‘సమీక్ష’కు చెప్పాయి.

కిరణ్ మిత్ర ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డా డేనియల్ భార్య. పార్టీకి విధేయత, ఏళ్లతరబడి పార్టీకోసం కష్టపడం వంటి పలు అంశాలు ప్రామాణికంగా దొడ్డా కిరణ్ మిత్రను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ప్రస్తావించాయి. కాగా అటవీ భూముల ఆక్రమణ ఆరోపణల్లో తీవ్ర వివాదాస్పదమై, లిక్కర్ సిండికేట్ దందాతో సంబంధం గల కుటుంబం నుంచి చైర్ పర్సన్ ఎంపిక ప్రసక్తే లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. పార్టీలోకి కొత్తగా వచ్చి చేరినవారికి కీలక పదవులను అప్పగిస్తే ఆదినుంచీ పార్టీకోసం కష్టపడుతున్నవారు ఇబ్బంది పడతారనే అంశాన్ని గుర్తించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Popular Articles