Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

బొగ్గుల శ్రీనివాస్ మృతి ఘటన.. అది దారుణ హత్య!?

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కారు వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, వాహనం నడుపుతున్న డ్రైవర్ పరారీ కావడం అనేక అనుమానాలకు తావు కల్పించింది.

అయితే శ్రీనివాస్ దారుణ హత్యకు గురైనట్లు ఖమ్మం జిల్లా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ ది ముమ్మాటికీ హత్యగానే భావిస్తూ, ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలుకు చెందిన రచయిత శ్రీనివాస్ ఎవరు, ఎక్కడికి వేడుకలకు పిలిచినా హాజరవుతుంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు.

పాలేరు రిజర్వాయర్ లో పడిన శ్రీనివాస్ ప్రయాణించిన కారును బయటకు లాగుతున్నప్పటి చిత్రం

అయితే నిన్న ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరగడంతో కారు ప్రమాదపు ఘటన చాలా మంది కంట పడలేదు. ఆ సమయంలో స్థానిక జాలర్లు రిజర్వాయర్ లో చేపల వేటను కొనసాగిస్తున్నారు. ఘటనానంతరం కారు డ్రైవర్ సూర్యాపేట మార్గాన్ని అనుసరిస్తూ నాయకన్ గూడెం దిశగా పరుగెత్తుతూ పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కారు డ్రైవర్ పరారీ వెనుక అనుమానాలతో కూడా వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండడంతో పోలీసులు దర్యాప్తుపై దృష్టి కేంద్రీకరించారు. శివరాత్రి బందోబస్తు విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, వివాదాస్పదమైన శ్రీనివాస్ అనుమానాస్పద మృతిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ శరీరంపై గల గాయాలను బట్టి అతనిది హత్యగా పోలీసులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బొగ్గుల శ్రీనివాస్ మృతదేహం

ఈమేరకు శ్రీనివాస్ సంబంధీకుల నుంచి అందిన ఫిర్యాదుపై అనుమానాస్పద మరణంగా ఇప్పటి వరకు ప్రాచుర్యంలో గల ఘటనను హత్యగా భావిస్తూ బీఎన్ఎస్ చట్టంలోని 103 (1) (పూర్వ ఐపీసీ చట్టంలోని 302 సెక్షన్) కింద కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. శ్రీనివాస్ హత్యోదంతంలో ఎవరెవరి ప్రమేయముందనే అంశంలో ఖమ్మం పోలీసులు త్వరలోనే వివరాలు వెల్లడించే దిశగా దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం.

Popular Articles