ఢిల్లీ: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గురువారం భేటీ అయ్యారు.ఈనెల చివరి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా రాజ్ నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఈ ప్రాంతానికి గల చారిత్రక నేపథ్యాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని 1948 ఫిబ్రవరిలో ఈసా, మూసీ సంగమ స్థలిలో కలిపిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

అదేవిధంగా ప్రజా ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ ను భవిష్యత్ లో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ వెంట తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ తదితరులు పాల్గొన్నారు.

