(సమీక్ష ప్రత్యేక కథనం)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల యుద్ధంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం అందుతున్న సమాచారం, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వర్గాల అంచనా, ‘సమీక్ష’ న్యూస్ నెట్ వర్క్ సేకరించిన వివరాలను మిళితం చేసినపుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక్యతను ప్రదర్శిస్తున్నది. అయితే ఇదే దశలో రెండు నుంచి మూడు మున్సిపాలిటీల్లో విపక్ష బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా పోరాడినట్లు స్పష్టమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఓ కార్పొరేషన్ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. హోరాహోరీగా పోరాడిన బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒకటి, రెండు మున్సిపాలిటీలు దక్కే అవకాశాలను తోసిపుచ్చలేని విధంగా పోలింగ్ సరళి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా అభివర్ణించడానికీ ప్రత్యేక కారణముంది. ఆ కారణాన్ని చివరలో తెలుసుకుందాం. అంతకు ముందుగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల అంచనా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్: ఇక్కడ అరవై డివిజన్లు ఉండగా, కాంగ్రెస్, సీపీఐలు వేర్వేరుగా తలపడ్డాయి. ఇరుపక్షాల మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్ దే పైచేయిగా తెలుస్తోంది. అధికార పార్టీకి 27-28 స్థానాలు, సీపీఐకి 24-25 స్థానాలు, బీఆర్ఎస్ కు 5-6 స్థానాలు దక్కే ఛాన్సుంది. మరో మూడు స్థానాల్లో హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఓ దశలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 32 సీట్లు దక్కినా ఆశ్చర్యం లేదనే సమాచారం అందుతోంది.
ఏదులాపురం మున్సిపాలిటీ: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురంలో 32 స్థానాల్లో కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఇప్పటికే ఓ స్థానాన్నిదక్కించుకోగా, మిగతా 31 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 18-19 స్థానాలు, బీఆర్ఎస్ 6, సీపీఐ 3-4, సీపీఎం 2-3 వార్డుల చొప్పున దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకానొక దశలో బీఆర్ఎస్ ఇక్కడ గట్టిపోటీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఫలితం పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గుగా ఉన్నట్లు సమాచారం.
అశ్వారావుపేట మున్సిపాలిటీ: అశ్వారావుపేటలో మొత్తం 22 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
మధిర మున్సిపాలిటీ: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన మధిరలో మొత్తం 22 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలుపు క్లియర్ గా కనిపిస్తోంది. మరో ఐదు స్థానాల్లో ఆయా పార్టీల మధ్య హోరో హోరీ పోరు నెలకొంది.
ఇల్లెందు మున్సిపాలిటీ: ఇల్లెందులో మొత్తం 24 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ కూటమి నాలుగు స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు వార్డుల్లో హోరా హోరీ పరిస్థితి ఉంది.
వైరా మున్సిపాలిటీ: ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుపు స్పష్టంగానే కనిపిస్తోంది. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 12-15 స్తానాల్లో, బీఆర్ఎస్ కూటమి 5-7 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
సత్తుపల్లి మున్సిపాలిటీ: సత్తుపల్లిలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. ఇక్కడ మొత్తం 23 వార్డులు ఉండగా, 14-15 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 12-13 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య ఈ గెలుపు స్థానాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
కల్లూరు మున్సిపాలిటీ: ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 11 వార్డుల్లో, కాంగ్రెస్ 9 వార్డుల్లో గెలవచ్చని సమాచారం. హోరాహోరీగా జరిగిన పోరులో ఇక్కడ కూడా గెలుపు స్థానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య తారుమారయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు.

పొంగులేటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకంటే..?
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ పోరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా అభివర్ణించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అధికార పార్టీతో సీపీఐ రాష్ట్రస్థాయిలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడం గమనార్హం. కారణం ఏదైనా కావచ్చు.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొత్తగూడెం వచ్చి కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. పొత్తు విషయంలో పట్టు, విడుపుల్లేకుండా వ్యవహరించడంలో ఏ పార్టీ బెట్టు చేసిందనే తర్కాన్ని వదిలేస్తే, పొత్తు మాత్రం కుదరలేదనేది సుస్పష్టం.
ఈ నేపథ్యంలో కొత్తగూడెం నగరపాలక సంస్థలో, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు మంత్రి పొంగులేటికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పక తప్పదు. ఇక్కడ కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూస్తే దాని ఫలితం పొంగులేటి రాజకీయ భవితనే ప్రశ్నార్థకంగా మార్చే అవకాశాలు ఉండేవి. కానీ పోలింగ్ ముగిసిన అనంతరం తెలుస్తున్న సమచారం ప్రకారం ఈ రెండు కేంద్రాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించబోతోంది.
ఇదే దశలో ఆదినుంచీ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగా, క్లారిటీగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నగర పాలక సంస్థ సహా మొత్తం ఎనిమిది మున్సిపాలిటీల్లో నాలుగు కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత అత్యంత సులభమని భావిస్తన్న పరిణామాల్లో మంత్రి పొంగులేటిని రాజకీయ పరిశీలక వర్గాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అభివర్ణిస్తున్నాయి.
ఇక తన సొంత మండలం కల్లూరు, సొంత నియోజకవర్గం సత్తుపల్లిలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తే పొంగులేటి ప్రతిష్ట రాజకీయంగా మరింత పెరిగే అవకాశాలున్నాయి. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో మాత్రం ఫలితాలపై ఈసారి ఎవరూ పందేలు కాయడానికి ముందుకురావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. రాజకీయ పందేలు కాసుకోవడంలో పోటీలు పడుతూ ముందుండే సత్తుపల్లి ప్రాంతవాసులు ఈసారి అందుకు విముఖంగా ఉన్నారంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరు తీవ్రతను అవగతం చేసుకవోచ్చు. కల్లూరులో ఓ పార్టీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓ వార్డులో రూ. 1.20 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారనే ప్రచారం సంచలనం రేపుతోంది. ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత అందిన సమాచారం ప్రకారం ‘సమీక్ష’ అంచనా.

