స్వామీ… ఏమీ చారిత్రక లొల్లి???
ఆది శంకరాచార్యులవారు రచించిన శివాపరాధ క్షమాపణ స్తోత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటిదాకా ఆథ్యాత్మిక చింతన లేకుండా ఉన్నవాళ్ళు శివయ్యా…నీ ధ్యాస ఇన్నాళ్ళూ లేనందుకు క్షమించమని వేడుకునే స్తోత్రం. అందులో… ఈ కింది మాటలు కూడా ఉంటాయి.
“పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ ।
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు”
అంటే…పౌరోహిత్యం, రాత్రి సంచారం, గ్రామాధికారిగా ఉండడం, నౌకరి చేయడం, మఠాధిపతిగా వ్యవహరించడం, అబద్ధాలు ఆడడం, సాక్ష్యం పలకడం, పరాన్నం భుజించడం, వేదాలను ద్వేషించడం, దుష్టులతో సహవాసం, ప్రాణులపట్ల దయలేకపోవడం, అనేవి ఓ పశుపతీ…నాకు జన్మ జన్మాంతరములందు కలుగకుండు గాక!
(నోట్: అనువాదం నా సొంత పైత్యం కాదు.)

చిన జీయర్ స్వామి ఆది శంకరుడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి… హిందూ సమాజంలో మఠాధిపతిగా వద్దురా…నాయనో… అని ఈ స్తోత్రం వేడుకుంటే, ఈ పోస్టు మస్తు మజాగా ఉందన్నట్లు చినజీయర్ స్వామి ఇన్స్టాల్మెంట్ల వారీగా వివిధ విషయాలపై వ్యాఖ్యలు చేస్తూ చర్చలకు తావిస్తున్నారు. పొలిటికల్ మఠాధిపతులు ఎక్కువ కావడం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం.
చరిత్ర శుద్ధ సత్యం అయ్యే అవకాశం తక్కువ. ఇష్టాయిష్టాలు, మనో వికారాలను బట్టి దాన్ని వక్రీకరించే వారే ఎక్కువ. ఉదాహరణకు, తెలంగాణ చరిత్ర రాయాలని కోరితే వరంగల్ హిస్టోరియన్ ఒకరకంగా, రాజమండ్రి చరిత్రకారుడు ఇంకోరకంగా రాయరూ? భావి తరాల వారు ఏది నమ్మాలి?
మన చర్చల్లో.. అప్పట్లో అది అట్లా, ఇట్లా వారు అట్లా, ఇట్లా…అని ఆ చరిత్ర దృక్కోణం నుంచి చూస్తున్నట్లు చెబుతూ మనకు అనువైన వాదనలు, నిర్ణయాలు చేస్తూపోతున్నాం. చరిత్ర తెలుసుకోవాలిగానీ దానికి మనదైన వెర్రి భాష్యాలు చెప్పి సమాజంలో లేనిపోని కలతలు సృష్టించడం మంచిది కాదేమో! ఇప్పటికే అభివృద్ధి కుంటుపడింది. మత విద్వేషాలు అమాంతంగా పెరుగుతున్నాయి. దేశభక్తి లేని వాళ్ళు… విషం కక్కుతున్నారు. కులం లంపటం ఎక్కువయ్యింది. మానవత్వం పోయి… పిచ్చి విషయాల మీద కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు.
ఏ మత గురువులైనా… ఇప్పుడు కల్లోల సాగరంలో ఉన్న జనాలకు ఊరట ఇవ్వడం మీద దృష్టి పెట్టాలిగానీ, ఈ గెలుకుడు పని ఎందుకు? దేవుడు ఎవరైతేనేమి? ప్రజల దారిద్య్రం తీరి ప్రశాంత జీవితానికి కావలసిన ఏర్పాటు చూడండి. అవిద్య, అనారోగ్యం, నిరుద్యోగం, ధరలు, అశాంతితో జనాలు ఛస్తున్నారు. వీటి మీద ఏమి చేయాలో చూడకుండా… పనికిరాని చర్చలు పెట్టి సమాజంలో మరిన్ని విభజనలకు కారణం కావడం మంచిదికాదు.

✍️ డా. ఎస్. రాము

