(సమీక్ష ప్రత్యేకం)
మున్సిపల్ ఎన్నికల పోరులో ఇదో రసవత్తర దృశ్యం. మున్సిపాలిటీలోకావచ్చు, లేదంటే కార్పొరేషన్ లో కావచ్చు.. ఛైర్మెన్, మేయర్ పీఠం దక్కాలంటే రాజకీయ పార్టీలు కనీసంగా ఎన్నిసీట్లు గెలవాలి? మొత్తం వార్డుల్లో మెజారిటీ స్ఠానాల్లో.. అంటే సగం సీట్లలో గెలుపొందాలి? ఒకటో, రెండో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలి. ఇరుపక్షాలకు సగం సగం సీట్లు లభించినా, ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఓటుతోనే ఛైర్మెన్ లేదా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. మిత్రపక్ష పార్టీల స్థానాలను కలుపుకున్నా ఆయా ప్రామాణికం ప్రకారమే గెలుపొందిన సీట్ల సంఖ్య ఉండాలి. ఇదీ మున్సిపల్ ఛైర్మెన్, కార్పొరేషన్ మేయర్ పీఠం అధిష్టించడానికి రాజకీయ పార్టీలకు అవసరమయ్యే సంఖ్య.
కానీ ఇందుకు విరుద్దంగా కేవలం మూడంటే మూడు సీట్లను గెలిస్తే మున్సిపల్ ఛైర్మెన్ పీఠం దక్కే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందా? అదెలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఖమ్మం జిల్లా మున్సిపల్ పోరులో సాక్షాత్కరిస్తున్న ఈ ఆసక్తికర దృశ్యపు కథనాన్ని ఆసాంతం చదవాల్సిందే..

సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో ఈ విచిత్ర సన్నివేశం నెలకొంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, ఛైర్మెన్ పీఠం జనరల్ గిరిజనుల కేటగిరీలో రిజర్వు అయింది. ఇక్కడ గల మొత్తం వార్డుల్లో 4, 6, 7 నెంబర్లు గల మూడు వార్డులు గిరిజనులకు రిజర్వు చేశారు. మామూలుగా అయితే ఇక్కడ ఛైర్మెన్ పీఠాన్ని దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు 10 లేదా 11 వార్డులను దక్కించుకోవాలి. సత్తుపల్లి ఎమ్మెల్యే ఓటు కూడా ఉన్నప్పటికీ, ఆ ఓటును సత్తుపల్లిలో వినియోగిస్తారా? లేక కల్లూరులోనా? అనేది వేరే విషయం. అది అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే స్థానంలో గల నాయకుడు తీసుకునే నిర్ణయం. ఈ నేపథ్యంలో సగానికన్నా ఒకటో, రెండో ఎక్కువ వార్డుల్లో విజయం సాధిస్తేనే ఛైర్మెన్ పీఠం దక్కుతుంది.
కానీ కల్లూరులో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొనడమే ఆసక్తికరం. గిరిజనులకు రిజర్వు అయినటువంటి మూడు వార్డుల్లో ఏ పార్టీ గెలిచినా వారిదే ఛైర్మెన్ పీఠం అవుతుంది. మిగతా పదిహేడు స్థానాలను మొత్తంగా దక్కించుకున్న రాజకీయ పార్టీకి ఛైర్మెన్ పీఠం దక్కే ఛాన్సే లేదు. అనివార్యంగా వైస్ ఛైర్మెన్ స్థానంతో ఆ పార్టీ సరిపెట్టుకోవలసిన స్థితి. అందుకే కాబోలు గిరిజనులకు రిజర్వు చేసిన 4, 6, 7 వార్డుల్లో ఖచ్చితంగా విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు కల్లూరు మున్సిపల్ పోరులో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మూడు వార్డుల్లో ప్రత్యర్థులను ఓడిస్తే ఛైర్మెన్ పీఠం దక్కడం ఖాయంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నెంబర్లు గల మూడు వార్డుల్లో విజయం కోసం అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఆసక్తికర అంశం ఏమిటో తెలుసా? ఎందుకైనా మంచిదని బీఆర్ఎస్ పార్టీ అదనంగా మరో వార్డులో గిరిజన అభ్యర్థిని రంగంలోకి దించింది. జనరల్ కేటగిరీలో గల ఐదో వార్డులో కాంగ్రెస్ ‘రెడ్డి’ అభ్యర్థిని పోటీలో ఉంచగా, గులాబీ పార్టీ మాత్రం ఇక్కడ గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపడం విశేషం. కల్లూరులో గిరిజనులకు రిజర్వు అయిన వార్డుల్లో బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థులనే పోటీ చేయిస్తున్నప్పటికీ, అధికార పార్టీకి గల శక్తి, యుక్తుల వల్ల ఆ మూడు వార్డుల్లో ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ చేతికి చిక్కకుండా ముందస్తు చర్యగా జనరల్ వార్డులో అదనంగా మరో గిరిజన అభ్యర్థిని పోటీలోకి దింపింది. ఆసక్తికరం కదూ.. కల్లూరులో మున్సిపల్ పోరు! బహుషా రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితి ఎక్కడా ఉండకపోవచ్చు..!!

