Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మేడారం జాతరలో వ్యాపార లావాదేవీల మొత్తం ఎన్ని వేల కోట్లో తెలుసా!?

మేడారం: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర.. పర్యాటకం, ఆధ్మాత్మిక కలగలిసిన జాతర మాత్రమే కాదు.. అంతకు మించి ఆర్థిక లావాదేవీల వ్యాపార జాతర కూడా. సమ్మక్క-సారలమ్మ జాతరలో వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో కూడా వ్యాపారాలు జరుగుతాయంటే ఆశ్చర్యం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది ఆదాయం పొందుతుండడం మరో విశేషం. నిర్ణీత తేదీల్లో కిటకిటలాడే మహాజాతర సంగతి ఎలా ఉన్నప్పటికీ, వాస్తవికంగా గడచిన నెలరోజులుగా మేడారంలో నిత్య ‘జాతర’ జరుగుతూనే ఉంది.

ఈనెల 27వ తేదీ వరకే 50 లక్షల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారిక అంచనా చెబుతోంది. 29వ తేదీన సమ్మక్క రావడానికి ముందే.. గురువారం ఒక్కరోజే 80 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సమ్మక్క గద్దెనెక్కిన తర్వాత ఈ సంఖ్య కోటి దాటవచ్చని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో జాతర జరిగే 4 కీలక రోజుల వరకు.. అంటే ఈనెల 31వ తేదీ నాటికి మూడు కోట్ల మంది వనదేవతలను దర్శించుకుంటారనేది ఓ అంచనా. భక్తుల రాకపోకలతో ఆర్టీసీతోపాటు, ప్రైవేటు వాహనాల యజమానులు, పెట్రోలు, డీజిల్ కొనుగోళ్ల పైన, లాడ్జీలు, రిసార్టులు, హోటళ్లు, చిరుతిళ్ల అంగళ్లు, బొమ్మల దుకాణాలు రద్దీతో కళకళలాడుతాయి. కేవలం జాతర జరిగే ప్రాంతంలోనేకాదు హన్మకొండ నుంచి మేడారం వరకు దారిపొడవునా హోటళ్ల వంటి అనేక వ్యాపార సంస్థలు తాత్కాలికంగా వెలుస్తాయి.

ఎందుకంటే సమ్మక్క-సారక్క జాతరలో అమ్మవార్ల ప్రధాన మొక్కుబడులు, నైవేద్యపు ఆచార పద్ధతులను పరిగణనలోకి తీసుకుంటే నిలువెత్తు బంగారంగా భక్తులు సమర్పించే బెల్లం బుట్టలతోపాటు, యాటపోతులు, కోళ్లు ఉంటాయి. ఇవిగాక మద్యపాన సేవనం జాతరలో అత్యంత సాధారణం. సుక్క, ముక్క అనివార్యమైన జాతర ఇది. ఇవిగాక సర్కస్ లు, మ్యాజిక్ షోలు, ఎగ్జిబిషన్లు, జాయింట్ వీల్స్ వంటి అనేక వినోదాత్మక వ్యాపారాలకు కొదువే ఉండదు. ఆయా అనేక అంశాలను బేరీజు వేసుకుని జరిగే ఆర్థిక లావాదేవీలను అంచనా వేసుకుంటే అచ్చెరువొందక తప్పదు.

ఇప్పటి వరకు మేడారం వనదేవతలను సందర్శించిన భక్తుల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉండగా, మొత్తంగా ఈ జాతర ముగిసేనాటికి ఓ మూడు కోట్ల మంది హాజరవుతారని భావిస్తే, వివిధ వ్యాపారాల ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? ఉదాహరణకు తక్కువలో తక్కువగా ఓ భక్తుడు మేడారం వెళ్లి వస్తే రవాణా ఛార్జీలు సహా కనీసం రూ. 1,000 ఖర్చవుతుంది. గరిష్టంగా ఇది రూ. 2,000 వరకు కూడా ఉండొచ్చు.

ఈ ప్రాతిపదికన గణిస్తే మూడు కోట్ల మంది భక్తులకు ఒక్కో మనిషికి సగటున కనిష్టంగా రూ. వెయ్యి, గరిష్టంగా రూ. 2 వేలు చొప్పున లెక్కిస్తే, రూ. 3,000 కోట్ల నుంచి రూ. 6,000 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కనిష్టం, గరిష్టం కాకుండా మధ్యస్థంగా మనిషికి రూ. 1,500 చొప్పున ఖర్చు చేసినట్లు లెక్కించినా మూడు కోట్ల మంది ద్వారా రూ. 4,500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు భావించవచ్చు.

Popular Articles