ముంబయి: బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబయి నుంచి బారామతికి వెడుతుండగా ఉదయం 8.45 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.
సాంకేతిక సమస్య ఏర్పడిన పరిణామాల్లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ సమయంలో విమానం కంట్రోల్ తప్పి కుప్పకూలింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది. దీంతో అజిత్ పవార్ సహా అందులో ప్రయాణిస్తున్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఎవరూ బతికి లేరని డీజీసీఏ ప్రకటించింది.
ఎప్పటికైనా మహారాష్ట్ర సీఎం కావాలనే కోరిక తీరకుండానే అజిత్ పవార్ అర్థంతరంగా ప్రాణాలు కోల్పోయారు. మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడైన అజిత్ పవార్ ఆయన అడుగుజాడల్లోనే అంచెలంచెలుగా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగానూ ఓసారి ఎన్నికయ్యారు. అజిత్ పవార్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

