Top 5 This Week

Related Posts

డిప్యూటీ సీఎం భట్టి సంచలన ప్రెస్ మీట్..! కాసేపట్లో..

హైదరాబాద్: తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరికాసేపట్లో సంచలనాత్మక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారా? తీవ్ర వివాదాస్పదమైన నైనీ బొగ్గు గనుల టెండర్లపై ఆయన ఏవేని సంచలన అంశాలను వెల్లడించబోతున్నారా? అనే ప్రశ్నలపై భిన్న ప్రచారం జరుగుతోంది. మరికాసేపట్లోనే.. పగలు 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం కొత్త విషమేమీ కాకపోవచ్చు. కానీ నైనా బొగ్గు టెండర్ల అంశంలో తనను టార్గెట్ గా చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై భట్టి భగ్గుమన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన గులాబీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’ శనివారం ఓ ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘బామ్మర్ది’ గుట్టు తవ్వుతున్న భట్టి!’ శీర్షికన ప్రచురించిన ఈ వార్తా కథనంలో తనను అవినీతిపరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్యనేతపై భట్టి కసితో ఉన్నారా? అనే ప్రశ్నను ఆ పత్రిక సంధించింది. అంతేకాదు ‘రేవంత్ తో తాడోపేడో తేల్చుకోవాలని భట్టి నిర్ణయం, సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా భట్టి రహస్య చర్చలు, అధికారిక షెడ్యూల్ ను రద్దు చేసుకుని మరీ మంతనాలు’ సాగించారనే ముఖ్యాంశాలతో ఈ వార్తా కథనం సాగింది.

ఈ నేపథ్యంలోనే మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో ఏయే విషయాలను వెల్లడించబోతున్నారనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క సంచలన అంశాలను వెల్లడించవచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. గులాబీ పత్రిక వార్తా కథనంలోని ముఖ్యాంశాలే ప్రామాణికంగా భట్టి ప్రెస్ మీట్ సాగితే మాత్రం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Popular Articles