Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మంలో కలకలం: నడిరోడ్డుపై పెద్దమ్మను చంపిన రౌడీషీటర్

ఖమ్మం: ఖమ్మం నగరంలో గురువారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చుని మిరపకాయల తొడిమలు తీస్తున్న పెద్దమ్మను నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపాడు ఆమె మరిది కుమారుడు. ఈ ఘటన ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఘటన పూర్వాపరాల్లోకి వెడితే..

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడేనికి చెందిన మోటె రాములమ్మ (70), యాదగిరి దంపతులు బతుకుదెరువుకోసం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డ ప్రాంతంలో జీవిస్తున్నారు. యాదగిరి సోదరులకు నాతాళ్లగూడెంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని యాదగిరి మరణానంతరం అతని భార్య రాములమ్మ తన కుమార్తె పేరు మీద రాసింది. సోదరుల్లో యాదగిరి పెద్దవాడు కావడంతో ఆయన మరణానంతరం రాములమ్మ ఈ భూమిని తన కూతురు పేరుమీద రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో యాదగిరి సోదరుల వారసుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.

ఘటనా స్థలంలో నిర్జీవంగా రాములమ్మ, రోదిస్తున్న బంధువులు

ఈ నేపథ్యంలోనే రాములమ్మ తనకు రాసిన ఐదెకరాల భూమిని ఆమె కూతురు సేద్యం చేసుకుంటుండడంతో యాదగిరి సోదరుల కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. గ్రామ పెద్దలు ఈ విషయంలో ఇటీవలే పంచాయతీ నిర్వహించి, వివాదం పరిష్కారమయ్యేవరకు భూమిని ఎవరూ సేద్యం చేయవద్దని తీర్మానించారు. అయినప్పటికీ రాములమ్మ కూతురు మరోసారి భూమిని సేద్యం చేసింది. ఈ భూమి విషయంలోనే రాములమ్మ మరిది కొడుకు శేఖర్ కూడా పంచాయతీకి దిగాడు.

గురువారం సాయంత్రం రాములమ్మ తన ఇంటి ముందు కూర్చుని మిరపకాయల తొడిమలు తీస్తుండగా, శేఖర్ అక్కడికి వచ్చి భూవివాదంపై పెద్దమ్మ రాములమ్మతో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్బంగా ముందస్తుగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో శేఖర్ రాములమ్మ ఊపిరితిత్తుల్లో బలంగా పొడిచాడు. అనూహ్య ఘటనలో తీవ్రంగా గాయపడిన రాములమ్మ నడిరోడ్డుపై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

సంఘటనా స్థలంలో పోలీసులు

ఈ ఘటనలో తనను నిలువరించే ప్రయత్నం చేసిన మహేష్ అనే వ్యక్తిని కూడా శేఖర్ తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత శేఖర్ త్రీ టౌన్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. శేఖర్ పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు కూడా సమాచారం. భూవివాదమే రాములమ్మ హత్యకు కారణంగా భావిస్తున్న త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles