Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

చంద్రబాబు ‘నామస్మరణ’ ఒక రాజకీయ అవసరం.. ఎందుకంటే!?

తెలంగాణ రాజకీయ చదరంగంలో గులాబీ బాస్ కేసీఆర్ వేసే ఎత్తుగడలు ఎప్పుడూ ఆసక్తికరమే. చాలా రోజుల మౌనం తర్వాత మళ్ళీ మైకు పట్టిన కేసీఆర్, తన రాజకీయ అమ్ములపొదిలోంచి తీసిన పాత అస్త్రం.. ‘చంద్రబాబు నాయుడు’.

రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా సరే, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చాలు, పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చంద్రబాబు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అసలు కేసీఆర్ ఎందుకు బాబును వదలరు? దీని వెనుక ఉన్నది వ్యక్తిగత ద్వేషమా? లేక అధికారం కోసం వేస్తున్న పక్కా స్కెచ్చా? లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.

బాబు అనే ‘బూచి’.. కేసీఆర్ కు రక్షణ కవచం!
నిజానికి ఇది ఈనాటి వ్యూహం కాదు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో, జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు తెలంగాణ నుంచి పెట్టేబేడా సర్దుకుని ఆంధ్రాకి వెళ్ళిపోయారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇక్కడే పట్టు బిగించారు. తెలంగాణలో టీడీపీకి అప్పట్లో బలమైన క్యాడర్, నాయకత్వం ఉండేది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ ఒక ప్రమాదాన్ని పసిగట్టారు.

బాబు ఇక్కడ బలంగా ఉంటే, భవిష్యత్తులో తన ఆధిపత్యానికి గండి పడుతుందని గ్రహించారు. అందుకే అప్పటి నుంచి “ఆంధ్రా పెత్తనం” అనే సెంటిమెంట్ ను రగిలించి, చంద్రబాబును ఒక రాజకీయ విలన్ గా చూపించడం మొదలుపెట్టారు. ఇది ఎంతగా వర్కవుట్ అయ్యిందంటే, చివరకు టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లో కూడా గులాబీ జెండా ఎగిరింది.

ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు టార్గెట్ మారింది కానీ, ఫార్ములా మారలేదు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు శిష్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ పై దాడి చేయాలంటే, ఆయన వెనుక చంద్రబాబు ఉన్నారనే ముద్ర వేయడం కేసీఆర్ కు చాలా సులువు.

“రేవంత్ పాలనలో మళ్ళీ ఆంధ్రా పెత్తనం వస్తుంది,” అని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేయాలన్నది గులాబీ బాస్ ప్లాన్. అంటే, బాబును తిట్టడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. అటు టీడీపీని లేవకుండా చేయడం, ఇటు రేవంత్ ను ఆంధ్రా మనిషిగా ముద్ర వేయడం.

అప్పుడు, ఇప్పుడు గతంలో కేసీఆర్ అమలు చేసిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ కూడా ఇందులో భాగమే. తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి లాంటి ఉద్ధండులను పార్టీలో చేర్చుకుని టీడీపీని ఖాళీ చేశారు. కేవలం ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాదు, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలం లేకుండా చేశారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కాకపోతే ఈసారి యుద్ధం కాంగ్రెస్ మీద. కానీ ఆయుధం మాత్రం పాతదే.. ‘తెలంగాణ ఆత్మగౌరవం’.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు గానీ, శాశ్వత అవసరాలు ఉంటాయి. కేసీఆర్ కు చంద్రబాబు నామస్మరణ ఒక రాజకీయ అవసరం. ఎప్పుడైతే సొంత గ్రాఫ్ తగ్గుతుందని అనిపిస్తుందో, అప్పుడు ‘ఆంధ్రా పెత్తనం’ అనే కార్డు బయటకి తీస్తారు. జనం సెంటిమెంట్ కు కనెక్ట్ అయ్యే వరకు ఈ సీరియల్ ఇలాగే కొనసాగుతుంది. మొత్తానికి గులాబీ బాస్ చాణక్యం ముందు ప్రత్యర్థులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే!

Popular Articles