హైదరాబాద్: దేశంలో ఒక సమున్నతమైన స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుడుగు వేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన అభిలషించారు. దీక్షా సంకల్పంతో నిర్ధేశించుకున్న లక్ష్య సాధనలో అందరి మద్దతు, సహాయ సహకారాలను కావాలని పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) (మీర్‌ఖాన్‌పేట్) లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇతర ప్రముఖులతో కలిసి సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుని ఉత్సవాలు చేసుకునే 2047 నాటికి యువ రాష్ట్రమైన తెలంగాణ ఏం సాధించగలదని నిపుణులతో ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) ఆలోచనలకు బీజం పడిందన్నారు. భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్ణయించుకుని సాధించాలని సంకల్పించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో దేవుళ్ల ఆశీర్వాదం తీసుకోవడం, ప్రజల మద్దతు, సహకారం కోరడం మా సంప్రదాయమని చెప్పారు.

తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందించుకున్న విజన్ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాన్ని సేవా రంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగంగా మూడు ప్రాంతాలుగా విభజన చేశామన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొట్ట స్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్దేశించాం. వాటినే క్యూర్, ప్యూర్, రేర్ అన్న మూడు ప్రత్యేక మండళ్లుగా విభజన చేశామన్నారు. ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరామని, వారి అంచనాలు, ఆలోచనలు, కలలను మాతో పంచుకున్నారన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నామని చెప్పారు.
నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు ఇందులో పాలుపంచుకోవడం తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ రెండు రోజుల సమ్మిట్‌లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. దేశానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దూరదృష్టితో ఆలోచనలు చేశారన్నారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం అన్నారు.

దేశ భవిష్యత్తుగా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి మేము ప్రేరణ పొందామన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, 2014 లో శ్రీమతి సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నామని, దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించిందన్నారు. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. దేశంలో తెలంగాణ యువ రాష్ట్రమని, ఈ రాష్ట్రం ఎంతో పెట్టుబడులకు సానుకూల వాతావరణం, ఎన్నో అవకాశాలున్నాయన్నారు.
అదేవిధంగా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. దేశ జనాభాలో తెలంగాణ దాదాపు 2.9% కలిగి ఉంది. జాతీయ జీడీపీలో దాదాపు 5% వాటాను అందిస్తున్నామన్నారు. తెలంగాణాను 2047 నాటికి, దేశ జీడీపీలో 10% వాటాను అందించే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చైనాలోని గ్వాంగ్ – డాంగ్ ప్రావిన్స్ గురించి ఉదహరిస్తానని చెబుతూ, గ్వాంగ్ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ఇతర ప్రావిన్స్‌కైనా అతిపెద్దదని, 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించడమే కాకుండా వృద్ధిని సాధించారని చెప్పారు. తెలంగాణలో తాము కూడా ఆ నమూనాను అందిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నారు. తాము చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందామన్నార. తామిప్పుడు ఆ దేశాలతో పోటీ పడదలచుకున్నామని, అందుకోసం తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించాలని, పెట్టుబడులు పెట్టాలని, మాకు మద్దతు ఇవ్వడానికి వారిని ఆహ్వానించామని తెలిపార.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు కొంత కష్టంగా అనిపించవచ్చునని, కానీ వాటిని సాధించగలమన్న విశ్వాసం తమకు ఉందన్నారు. కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దామని, మీరది అసాధ్యమని భావిస్తే మరికొంత గడువిస్తానని, తమ బృందానికి చెబుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. నిన్నటికంటే ఈరోజు తనలో మరింత నమ్మకం పెరిగిందన్నారు. ‘నిన్నటి రోజున అదొక కల, ఒక ప్రణాళిక. ఇప్పుడు మీరంతా మాకు మద్దతుగా నిలిచారు. దృఢసంకల్పంతో సాగిస్తున్న మా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీ అందరి మద్దతు, సహకారంతో లక్ష్యాలను సాధించగలం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలతో సాగుతున్న తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు. ఒక మంచి సంకల్పంతో వేసిన ఈ ముందడుగులో మా లక్ష్యాలను సాధించడానికి మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మీర్ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. వేడుకకు ముందు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, మేధావులు ఉన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైడర్, నోబెల్ శాంతి గ్రహీత కైలాష్ సత్యార్థి, టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్. దినేష్ గారు, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ శోభన కామినేని, అదానీ పోర్ట్స్ & SEZ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తదితరులు ప్రసంగించారు.
నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీనియర్ అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రపంచ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు.

