Top 5 This Week

Related Posts

మీవద్ద జబ్బు ఉంది, నా దగ్గర వైద్యం ఉంది, మధ్యలో డబ్బు దేనికి?! అని ప్రశ్నించే ఓ ప్రజా వైద్యుని కథ

‘వైద్యో నారాయణో హరిః అన్నారు.. అంటే వైద్యుడు నారాయణుడు (విష్ణువు)తో సమానమని అర్థం. దాదాపుగా అందరికీ తెలిసిన సూక్తే కావచ్చు. కానీ నారాయణుడి వంటి వైద్యులు ఎక్కడోగాని.. ఎప్పుడోగాని అరుదుగా కనిపిస్తుంటారు. ఇటువంటి వైద్యులను ప్రజానీకానికి పరిచయం చేసే అవకాశమో, అదృష్టమో కొందరు జర్నలిస్టులకు మాత్రమే లభిస్తుంది. అది నాకూ లభించడమే ఈ వార్తా కథనంలోని అసలు విశేషం. ఆ కథనంలోని ఫ్లాష్ బ్యాక్ లోకి వెడితే..

దాదాపు పాతికేళ్ల క్రితం.. కరీంనగర్ నుంచి ఖమ్మానికి ‘వార్త’ స్టాఫ్ రిపోర్టర్ గా బదిలీ అయ్యాను. కొద్దికాలానికే బ్యూరో ఇంఛార్జిగానూ మారాను. ఖమ్మంలో ఉద్యోగంలో చేరాక కొన్ని నెలలకే మఫిసిల్ ఎడిటర్ టీకే లక్ష్మణ్ రావు గారు ఫోన్ చేశారు. UNI లేదా PTIలలో ఏదో ఒక న్యూస్ ఏజెన్సీ అందించిన వార్తను తెలుగులోకి అనువదించి జాతీయ పేజీలో ప్రచురితమైన ఓ నాలుగైదు లైన్ల న్యూస్ క్లిప్పింగ్ ను నాకు పంపిస్తూ, ఇతని గురించి ఆరా తీయాల్సిందిగా సీఎండీ ఆదేశమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం అడవుల్లోని ‘గండ్సరి’ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వనమూలికలతో వైద్యం చేస్తున్నాడనేది నాలుగైదు లైన్ల వార్త సారాంశం.

ఖమ్మం జిల్లాకు నేనూ కొత్త కావడం, ఇప్పుడున్నంత వాట్సాప్ కమ్యునికేషన్ లేకపోవడంతో ఆ వనమూలికల వైద్యుని గ్రామం ఎక్కడుందో తెలుసుకోవడానికి దాదాపు వారం రోజులు పట్టింది. కాకపోతే అతను తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్నాడని సమాచారం సేకరించగలిగాను. ఇదే విషయాన్ని మఫిసిల్ ఎడిటర్ లక్ష్మణ్ రావు గారికి నివేదించాను. ఓసారి సీఎండీ గిరిష్ సంఘీ గారితో మాట్లాడాల్సిందిగా ఆయన సూచించారు.

డాక్టర్ గోపాలకృష్ణపై రాసిన కథనం

నేను గిరీష్ సంఘీగారికి ఫోన్ చేశాను. విషయం నివేదించాను. ‘వెళ్లి రా.. కోయంబత్తూర్’ అన్నారు ఆయన. ‘సార్.. నాకు తమిళం రాదు.. నేనేం చేయాలి అక్కడికి వెళ్లి..’ అని తప్పించుకునేందుకు ప్రయత్నించాను. ‘వెళ్లు.. భాషతో నీకు పని లేదు. నీ ప్రొఫెషనల్ స్టామినా ఏంటో నాకు తెలుసు. నువ్వు బాగా రాయగలవని నీకు అసైన్ చేస్తున్నాను. అకౌంటెంట్ కు చెబుతాను. ఖర్చులకు రూ. 10 వేలు ఇస్తాడు. వెళ్లి వచ్చాక ఖర్చుల బిల్లు మొత్తం సమర్పించు. ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు. కోయంబత్తూర్ వెళ్లి ఆ వనమూలిక వైద్యుని గురించి పూర్తి కథనం రాయల్సిందే’ అని ఆదేశించారు.

ఎక్కడి మేడారం.. ఏటూరునాగారం..? వయా వరంగల్ మీదుగా కరీంనగర్. అక్కడి నుంచి ఖమ్మం రావడమే అనివార్యం. మళ్లీ ఈ కోయంబత్తూరు ఏంట్రా బాబూ.. అనుకుంటూ నిట్టూర్పుతో మఫిసిల్ ఎడిటర్ లక్ష్మణ్ రావుగారికి మళ్లీ ఫోన్ చేశాను. ‘సార్ నేను కోయంబత్తూరు వెళ్లి వచ్చేసరికి ఖమ్మంలో నా ఉద్యోగం ఉంటుందా? మళ్లీ ఏ కడపకో ట్రాన్స్ ఫర్ చేస్తారా? అని ప్రశ్నించాను. (ఎందుకంటే అప్పట్లో ‘వార్త’లో గిరిష్ సంఘీ గారిని మభ్యపెడుతూ రిపోర్టింగ్ నెట్ వర్క్ లోని ఓ వ్యక్తి ఏలిన రాజ్యం ‘కతలు’ అలా ఉండేవి మరి) బదిలీ, గిదిలీ ఏమీ ఉండదు.. నువ్వు ప్రశాంతంగా వెళ్లి సీఎండీగారి అంచనా ప్రకారం మాంచి స్టోరీ ఇవ్వు.. అని చెప్పారు.

డాక్టర్ గోపాలకృష్ణపై రాసిన కథనం తరువాయి భాగం

ఇక తప్పదనుకుని ఫొటోగ్రాఫర్ నాగరాజును వెంటేసుకుని కోయంబత్తూరు వెళ్లి వనమూలికల వైద్యుని ఆచూకీని కనుగొని, తిరుచ్చి, పొల్లాచ్చి వంటి పలు ప్రాంతాల్లో తిరిగి అతని గురించి నేను రాసిన ఆసక్తికర వార్తా కథనం ‘సండే మేగజైన్’ కవర్ స్టోరీగా మారింది. ఈ విషయం వేరే కథనంలో చెప్పుకుందాం. కోయంబత్తూరుకు పయనమైన సమయంలోనే మరో అసైన్మెంట్ కూడా ఇచ్చారు. చెన్నయ్ లో డాక్టర్ గోపాలకృష్ణ అనే హోమియో వైద్యుడు ఉంటారు. పానగల్ పార్కు వద్ద ఓ ఇనుప కుర్చీ వేసుకుని ప్రజలకు మందులు ఇస్తుంటాడు, అతని గురించి కూడా స్పెషల్ స్టోరీ రాయాలనేది అసైన్మెంట్ సారాంంశం. అంతేకాదు దారిలో వస్తూ, వస్తూ పక్షిరాజా స్టూడియో గురించి రాయాలన్నారు.

మొత్తంగా తమిళనాడులో స్పెషల్ అసైన్మెంట్. ఖమ్మం టూ కోయంబత్తూర్. అక్కడి నుంచి చెన్నయ్. రైలు దిగగానే ఏం చేయాలో పాలుపోలేదు. మఫిసిల్ ఎడిటర్ లక్ష్మణ్ రావు గారి సూచనమేరకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సబ్ ఎడిటర్ గా పనిచేసే సురేష్ అనే వ్యక్తి సహాయంతో ఎట్టకేలకు డాక్టర్ గోపాలకృష్ణను కలుసుకుని మాట్లాడగలిగాను. ఆయన శిష్యురాలు డాక్టర్ రీటాతోనూ మాట్లాడాను.

‘వార్త’ సీఎండీ గిరిష్ సంఘీతో..

‘మీవద్ద జబ్బు ఉంది, నా దగ్గర వైద్యం ఉంది, మధ్యలో డబ్బు దేనికి?!’ అని ప్రశ్నించే ఓ గొప్ప ప్రజావైద్యున్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేయగలిగాను. పానగల్ పార్కు వద్ద పేవ్ మెంట్ పై ఓ ఇనుప కుర్చీ వేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ గోపాలకృష్ణను చెన్నయ్ పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా, అప్పటి తమిళనాడు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి జోక్యం చేసుకుని వారిని నిలువరించారంటే ఆ వైద్యుని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

Popular Articles