Top 5 This Week

Related Posts

పట్టుకుంటే నాటుకోడి.. పంట చేలో ఎగబడిన జనం

హన్మకొండ: ఎవరు వదిలారో, ఎందుకు వదిలారో తెలియదు. కానీ దాదాపు రెండు వేల నాటుకోళ్లు పంట చేలల్లో కనిపించేసరికి జనం ఎగబడ్డారు. దొరికినోడిదే కోడి.. అంటూ పట్టకున్న నాటుకోళ్లతో ‘పండుగ’ చేసుకునేందుకు ఇళ్లకు వెళ్లిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట ప్రధాన మార్గంలో శుక్రవారం ఉదయమే అటుగా వెడుతున్న పలువురికి పంట చేలల్లో గుంపులుగా నాటుకోళ్లు కనిపించాయి. ఇంకేముందు అందినకాడికి పట్టుకుని జనం హ్యాపీగా వెళ్లిపోయారు. దాదాపు రెండు వేల కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తికి సుమారు కిలోమీటరు తర్వాత సిద్ధిపేట మార్గంలో వదిలేశారు. సాధారణంగా గ్రామాల్లో పెరిగిన నాటుకోళ్లలు కాకపోవడం, నిర్దేశిత ఫాంలలో పెంచిన సెమీ నాటుకోళ్లు కావడంతో ప్రజలకు సులభంగానే పట్టుబడ్డాయి.

అయితే ఈ కోళ్లను ఎవరు.. ఎందుకు వదిలేశారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. కష్టపడి దొరకబుచ్చుకున్న నాటుకోళ్లను వండుకుని తినేందుకు కొందరు సంశయించిన పరిస్థితుల్లోనే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ స్పందించారు. ఈమేరకు కొన్ని నాటుకోళ్లను పశువైద్యాధికారి దీపిక వద్దకు తీసుకువెళ్లగా, ఆమె వరంగల్ లోని ల్యాబ్ లో పరీక్షలు జరిపి కోళ్లకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఇంతకీ ఈ కోళ్లను ఎవరు వదిలేశారనే అంశంపై స్థానికులు వింతగా చెప్పుకోవడం విశేషం. బహుషా కోళ్లను ఫాంలో పెంచిన వ్యక్తి లేబర్ కు అడినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడంతో కసితో వాళ్లే వదిలేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేశారు. కోళ్లను ఎవరు వదిలేశారనే సమాచార సేకరణలో మరోవైపు పోలీసులు నిమగ్నమయ్యారు.

Popular Articles