Top 5 This Week

Related Posts

తమిళ హీరో విజయ్ సభలో తొక్కిసలాట, 31 మంది దుర్మరణం!

తమిళ సినిమా హీరో, తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ శనివారం నిర్వహించిన ర్యాలీ, సభలో తొక్కిసలాట జరిగింది. తమిళనాడులోని కరూర్ లో జరిగిన పార్టీ సభలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరణించినవారిలో పార్టీ కార్యకర్తలతోపాటు ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. కరూర్ సభలో విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోగా, పరిస్థితిని గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సభకు హాజరైన భారీ జన సమూహం వల్ల తొక్కిసలాటలో గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు తెలుస్తోంది. కాగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కరూర్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారగణాన్ని ఆయన ఆదేశించారు. గాయపడినవారిని సీఎం స్టాలిన్ ఆదివారం ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించనున్నారు.

Popular Articles