Top 5 This Week

Related Posts

ఖమ్మం ప్రముఖునికి సీబీఐ పిలుపు!?

ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖునికి చెన్నయ్ సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారుల నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ ప్రముఖుడు ఉన్నఫళంగా చెన్నయ్ కి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం గల ఓ క్రీడా సంస్థపై సీబీఐ అధికారులు ఐపీసీ 420, 120-బి సెక్షన్ల కింద దాదాపు రెండు నెలల క్రితం.. గత మే నెలాఖరున ఓ కేసు నమోదు చేశారు. అనధికార ఛాంపియన్ షిప్ లను నిర్వహించడం, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అంశాలపై నేరపూరిత కుట్ర, మోసం వంటి అభియోగాలపై ఈ సంస్థ మాజీ ఉపాధ్యక్షునిపైనా, మాజీ సెక్రటరీ జనరల్ పైనా సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ సంస్థపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా కొందరు వ్యక్తులు రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ జారీ చేసిన నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందారనే అంశంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కు సైతం ఫిర్యాదు అందిన నేపథ్యంలోనే సీబీఐ కేసు నమోదు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ క్రైం సిండికేట్లతో ముడిపడి ఉన్న అనేక అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రీడా సంస్థలో కీలక బాధ్యతను నిర్వహిస్తున్న ఖమ్మానికి చెందిన ఓ ప్రముఖున్ని విచారణ కోసం రావలసిందిగా సీబీఐ అధికారులు పది రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రముఖుడు సీబీఐ పిలుపు మేరకు చెన్నయ్ కి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. శనివారం ఈ ప్రముఖున్ని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తూ సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది.

Popular Articles