Top 5 This Week

Related Posts

కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశా, నిర్దేశం

రాష్ట్రంలో 15 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌లో పంటల సాగు విషయంలో రైతులకు అవసరమైన తక్షణ చర్యలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. మిగిలిపోయిన చోట ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా వంటి కీలకమైన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో, ఇతర మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు.

సీజన్ కు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులు 29, 30 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జూన్ 1 నాటికి నివేదికలు అందజేయాలని చెప్పారు. రాబోయే నెల రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగెత్తించాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సేకరించిన ధాన్యంపై 48 గంటల్లో రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 90 శాతం మేరకు ధాన్యం సేకరణ పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కలెక్టర్లను అభినందించారు.

అదేవిధంగా రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించే విషయంలో అక్కడక్కడ ఇబ్బందిగా మారిన విషయాన్ని ప్రస్తావించి తీసుకోవలసిన చర్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 29 శాతం అధిక వర్షపాతం నమోదైందని, సీజన్ ముందుగా రావడంతో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మిగిలిపోయిన చోట ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉండాలని, వానాకాలం సీజన్‌లో తీసుకోవలసిన చర్యలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తీసుకోవలసిన చర్యలను వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సీఎం, పక్కన పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం
కాగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ (GHMC), పోలీస్, హైడ్రా (HYDRAA), ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు.

నగరంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుస్తు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని, అన్ని జిల్లాల్లోనూ సీజన్‌కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Popular Articles