Top 5 This Week

Related Posts

మీడియాపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి

యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల అంశంపై మీడియాలో సరిగ్గా కవరేజీ రావడం లేదని తెలంగాణా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరుగుతున్నప్పటికీ మీడియాలో సరిగ్గా కవర్ కావడం లేదన్నారు. పత్రికలలో వచ్చే నెగటీవ్ వార్తలపై స్పందించాలని, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరిగిందని, ప్రభుత్వం దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, రవాణా వాహనాల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగ్ లు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టాలన్నారు. రైస్ మిల్లర్లతో కలెక్టర్, ఉన్నతాధికారులు చర్చించాలని, జిల్లాల్లో అవసరమైతే ఇంటర్మీడియట్ గోదాములకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలన్నారు. అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. గత జనవరి 26 తర్వాత మన రాష్ట్రంలో నూతనంగా 1,57,467 రేషన్ కార్డులను పంపిణీ చేశామని, మీసేవ కేంద్రాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ధాన్యం పెండింగ్ లో ఉన్నదని, కొనుగోలు సజావుగా పూర్తి చేయాలని, మిల్లర్ల వద్ద తరుగు తీయకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో చర్చించి నిర్దేశించిన మేర వాహనాలు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రైస్ మిల్లుల వద్ద తరుగు లేకుండా చూడాలన్నారు. గన్ని బ్యాగులు సమస్య రాకుండా చూసుకోవాలని, రవాణా సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని మంత్రి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇతర అధికార గణం

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ, ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళికా బద్దంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్ గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే చిన్న, చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి రోజు జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ పురోగతిపై మీడియాకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కరించి ఆ సమాచారం కూడా రైతులకు మీడియా ద్వారా తెలియ జేయాలన్నారు.

Popular Articles