హెడ్డింగ్ తప్పనుకుంటున్నారా..? కానే కాదు.. మీరు చదువుతున్నది కరెక్టే. బాలికపై కాదు బాలునిపైనే లైంగిక దాడి ఘటన ఇది. అభం శుభం తెలియని పధ్నాలుగేళ్ల బాలునితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడిన ఓ యువతిపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సాధారణ లైంగిక వేధింపుల కేసు కాదు.. పోక్సో కేసును యువతిపై నమోదు చేయడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్న మహిళ ఒకరు తన భర్త, కుమారునితో కలిసి అక్కడే సర్వెంట్ క్వార్టర్స్ లో నివాసముంటున్నారు. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో కుమారుడు ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే వీరి క్వార్టర్స్ పక్క గదిలో ఉండే మరో యువతి కూడా పనిమనిషిగానే పనిచేసుకుని జీవిస్తోంది. ఆ యువతి బాలున్ని బ్రదర్ అని, ఈ బాలుడు ఆ యువతిని సిస్టర్ అంటూ పరస్పరం పిలుచుకునేవారు.

ఈ నేపథ్యంలోనే యువతి ఓసారి తన కుమారుడిని ముద్దు పెట్టుకోవడంతో బాలుని తల్లి ఆమెను మందలించింది. అయితే గత మార్చి నెలలో తాను గదిలో ఒంటరిగా ఉండగా యువతి తనను ముద్దు పెట్టుకుందని బాలుడు చెప్పాడు. నిన్ను ఇష్టపడుతున్నానని, నిన్ను ఏమి చేసినా మౌనంగా ఉండాలని, లేకపోతే దొంగతనం కేసు పెట్టి మీ తల్లి ఉద్యోగం తీయిస్తానని సదరు యువతి బెదిరించిందని బాలుడు పేర్కొన్నాడు.
దీంతో ఆమె చెప్పినట్లుగానే బాలుడు చేసేవాడు. ఈ క్రమంలోనే బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది. తన కుమారుడిని బ్రదర్ అంటూనే ఆయా యువతి లైంగిక దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆయా బాలుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గల ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

