Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి సతీమణి మాధురి మామిడికాయ పచ్చళ్లు ఎందుకు పెడుతున్నారు!?

వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తినడం తెలుగు రాష్రాల ప్రజలకు అలవాటు. అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలామంది తమ అమ్మగారింటి నుంచి వచ్చే ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తుంటారు. ఇదంతా ఎందుకంటారా..? అమ్మగారింటి నుంచి ఆవకాయ పచ్చడి రావడం సహజం, కానీ అదే ఆవకాయ పచ్చడి మంత్రిగారి సతీమణి చేతుల మీదుగా తయారై మనం తినే పల్లెంలోకి వస్తే.. ఆ సంతోషమే వేరు కదా! ఈ విషయంలో తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసుకు వచ్చే అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అదృష్టవంతులనే చెప్పాలి. ఇంతకీ విషయమేమిటంటే..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురికి అమ్మలాంటి మనసు ఉందని ఆయన ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది చెబుతుంటారు. ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. స్వయంగా మాధురి క్వింటాళ్ల కొద్దీ మామిడికాయ పచ్చళ్లు తయారు చేయిస్తారు. ఈ పచ్చళ్ల తయారీలో ఆమె కూడా స్వయంగా పాల్గొంటారు. మామిడి తురుము పచ్చడి, సన్న ముక్కల పచ్చడి, లావు ముక్కల పచ్చడి, అల్లం మామిడి పచ్చడి వంటి రకరకాలుగా మొత్తం పది రకాల మామిడి కాయ పచ్చళ్లు తయారు చేయిస్తుంటారు. ఇలా తయారైన పచ్చళ్లను ఏం చేస్తారో తెలుసా?

మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ సందర్భంగా మంత్రి సతీమణి మాధురి చేతుల మీదుగా తయారైన మామిడి కాయ పచ్చడిని కూడా వడ్డిస్తుంటారు. అంతేకాదు పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్, క్యాంపు ఆఫీసు, హైదరాబాద్ లోని తమ ఆఫీసుల సిబ్బందికీ జాడీల కొద్దీ పచ్చళ్లు పంపిస్తుంటారు. మరికొన్ని జాడీల పచ్చళ్లను తమ వియ్యంకుల కుటుంబాలకు, సమీప బంధువులకు కూడా పంపిస్తుంటారు. ఇలా ఏటా పచ్చళ్ల తయారీ ప్రక్రియను మంత్రి సతీమణి మాధురి ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారని పొంగులేటి క్యాంపు ఆఫీసు వర్గాలు ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పాయి.

Popular Articles