గడచిన వారం రోజుల్లో తెలంగాణాలోని పలు జిల్లాలో అకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక మంది రైతులు చేతికొచ్చిన తమ పంటలను కోల్పోయారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీవ రకు కురిసిన అకాల, వడగళ్ల వానల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది.
ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 64 మండలాల్లో మొత్తం 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తమకు అందిన ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు ఎక్కువగా నష్టం జరిగిందన్నారు.
ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లిందని, ఇది ప్రాథమికంగా జరిపిన అంచనా నివేదిక మాత్రమేనని పేర్కొన్నారు. మొత్తం నష్టంపై పూర్తి నివేదిక వచ్చాక బాధిత రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. పంటలవారీగా నష్టం వివరాలతో తుది నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

