రెండంటే రెండు రోజులపాటు అసెంబ్లీకి హాజరైనందుకు బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్ తీసుకున్న జీతభత్యాల మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాలా 57 లక్షల 84 వేల 124 రూపాయలు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం… అంటే డిసెంబర్ 2023 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పదిహేను నెలలకుగాను జీత భత్యాల రూపంలో కేసీఆర్ కు ప్రభుత్వం చెల్లించిన మొత్తం అన్నమాట.
విపక్ష నేత కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని పదే పదే అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రభుత్వానికి మంచి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అనేకసార్లు కోరిన విషయమూ విదితమే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ వేదికగా కేసీఆర్ తీసుకున్న జీతభత్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని, ఆయన తన బాధ్యతలను నెరవేర్చడం లేదన్నారు. కనీసం నియోజకవర్గ పర్యటనకు కూడా వెళ్లడం లేదని, ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం లేదన్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులేని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ తీసుకున్న జీతభత్యాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆయా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

