ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య దాగిన ఆధిపత్య పోరుకు నిదర్శనంగా ఈ ఘటనను అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇద్దరు మంత్రుల మధ్య ఉన్నట్లు గుసగుసలు సాగుతున్న తీవ్ర రాజకీయ అగాధానికి పరాకాష్టగా కూడా తాజా సంఘటనను కాంగ్రెస్ శ్రేణులే అభివర్ణిస్తున్నాయి. ఓ మంత్రి ప్రతిష్టను మసక బార్చేందుకు మరో మంత్రి వర్గీయులు పాత వీడియోను సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా వైరల్ చేస్తున్న ఘటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ విషయమేమిటంటే..?
మొన్నీ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫాం హౌజ్ పై కోడి పందేలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలోని తొల్కట్టలో జరిగిన ఈ ఉదంతంలో పెద్ద ఎత్తున నగదు, కార్లు, కోళ్లను, కోడికత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు. ఫాం హౌజ్ యజమాని, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు ఈ విషయంలో నోటీసులు జారీ చేయగా, తొల్కట్టలోని వ్యవసాయ భూమి తనదేనని, కానీ తాను ఇతరులకు లీజుకు ఇచ్చానని, అక్కడ జరిగినట్లు పేర్కొంటున్న కార్యకలాపాలతో తనకెటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లా అధికార పార్టీ నాయకుల మధ్య, ముఖ్యంగా మంత్రుల మధ్య అంతర్గతంగా నెలకున్న వర్గ విభేదాలను, ఆధిపత్య పోరును బహిర్గతం చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రి ముఖ్య అనుచరునికి కోడి పందేలకు హాజరయ్యే అలవాటు ఉంది. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఈ నాయకుడు ఏటా సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లి కోడి పందేలలో పాల్గొంటారనేది బహిరంగమే. ఇందులో రహస్యం కూడా ఏమీ లేదు. తన ఆప్తులను, స్నేహితులను పిలిపించుని మరీ ఏపీలో కోడి పందేలకు హాజరై, పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా నూజివీడు సమీపంలోని కొత్తూరు తోటలో నిర్వహించిన కోడి పందేలలో మంత్రి ముఖ్య అనుచరుడు ఎప్పటిలాగే పాల్గొన్నారు. తన సమీప బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు కోడి పందేల సంబురాన్ని రుచి చూపించారు. ఈ సందర్భంగా ఆయన కోడి పందేలలో పాల్గొన్న వీడియో క్లిప్పు ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మరో మంత్రికి చెందిన వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నెలకున్న ఆధిపత్య పోరుకు నిదర్శనంగా అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ నాయకున్ని ఇందులోకి లాగి బద్నాం చేయాలనే ఓ మంత్రి అనుచరుల కుట్రగా మరో మంత్రి అనుయాయులు అభివర్ణిస్తున్నారు.
సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో గురించి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న మంత్రి ముఖ్య అనుచరుడు, ప్రభుత్వ సంస్థకు నామినేటెడ్ చైర్మెన్ పదవిలో గల నాయకున్ని ‘సమీక్ష’ న్యూస్ ప్రశ్నించగా, తాను కోడి పందేలకు వెళ్లే అంశం రహస్యమేమీ కాదని, ఆ వీడియో తాను ఏపీలో జరిగిన కోడి పందేలకు వెళ్లినప్పటిదిగా ఆయన పేర్కొన్నారు. ఏపీలో కోడి పందేలకు వెళ్లడం తన అటవాటని, ఎన్నో ఏళ్లుగా తాను అక్కడి పందేలకు వెళ్లి పాల్గొంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన ఫాం హౌజ్ లో జరిగిన కార్యక్రమానికి హాజరు కావలసిన అవసరం తనకు లేదని అన్నారు.

