సికింద్రాబాద్ ఉజ్జయిన మహాకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రధాన ఘట్టం ‘రంగం’ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
‘‘బోనాల జాతరలో సంతోషంగా సాకలు పోసి బాగా చేశారు. ప్రతీసారి చేసినట్టే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతీ సంవత్సరం చెబుతున్నా.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నా పూజలన్నీ సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను. నాకు రక్తం బలి కావాలి’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

అదేవిధంగా తనను కొలిచే వారికి తాను ఎప్పుడూ తోడుగా నిలబడుతానని, రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందని, ప్రజలు జాగ్రత్త ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయని, ఐదు వారాలు పాటు తనకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలని, తనకు రక్తం చూపించాలని, లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందన్నారు. తన రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారని స్వర్ణలత భవిష్యవాణిలో వినిపించారు.

