ఖమ్మం: ఆహార భద్రతా ప్రమాణాల అంశంలో ఖమ్మంలోని పలు ప్రముఖ హోటళ్లకు, వ్యాపార సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలపై పలు వ్యాపార సంస్థలకు జరిమానా విధించారు. ఖమ్మం జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాల అమలులో భాగంగా నమోదైన 11 కేసులను పరిష్కారించారు. సంబంధిత ఆహార, వ్యాపార సంస్థలపై మొత్తం ₹2,90,000/- జరిమానా విధించారు.
- జరిమానా విధించిన ముఖ్య సంస్థలు:
- రమేష్ ధాబా – రూ. 1,00,000/-
- హవేలీ – రూ. 75,000/-
- రిలయన్స్ రిటైల్ – రూ. 50,000/-
- డిలైట్ మండీ – రూ. 20,000/-
- జాజూ (Zazu) – రూ. 20,000/-
- ఇతర కేసులలో మిగిలిన మొత్తాన్ని జరిమానాగా విధించారు.
ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత, నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. FSSAI నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఖమ్మం జిల్లా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు, నమూనాల సేకరణ, అమలు చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సి.హెచ్. లోకేష్ తెలిపారు.

