హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్లాట్ల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫార్చ్యూన్ హోమ్స్ అధినేత రోసిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతన్నిఅరెస్ట్ చేశారు.
ఏసీబీ వర్గాల కథనం ప్రకారం.. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా రూ. 10 లక్షల మొత్తాన్ని రోసిరెడ్డి నుంచి ఎస్ఐ విజయ్ డిమాండ్ చేశాడు. తాను రూ. 10 వేలకు మించి ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో ఆయా కేసులో అతన్ని రిమాండ్ చేశారు. అయితే పాత కేసుల్లో నోటీసు పేరుతో పిలిపించి రూ. లక్ష ఇవ్వాలంటూ ఎస్ఐ విజయ్ డిమాండ్ చేశాడు.
దీంతో ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. ఆయా పరిణామాల్లో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ఎస్ఐ విజయ్ కోసం వల వేశారు. ఫిర్యాదుదారుని నుంచి రూ. లక్ష మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. అధికారిక ఏసీబీ ప్రకటన, కేసు వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
