Top 5 This Week

Related Posts

ఖమ్మంలో శ్రీవారి ఆలయం.. దైవ సంకల్పం: చిన్న జీయర్ స్వామి

ఖమ్మం: ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం శుభసూచకమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రవచించారు.

సోమవారం ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రవచనం చెబుతూ, రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో శుభప్రదమని అన్నారు. దేశంలో ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా రైతులు, కుమ్మరులు సహా అన్ని వర్గాల ప్రజలు ముందుగా భగవంతుడిని స్మరించుకుని తమ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. భగవంతుడిని స్మరించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు టెలివిజన్ మాధ్యమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మం నగరానికి విచ్చేసేందుకు నేడు తొలి అడుగు పడిందని అన్నారు. ఆశ్వయుజ మాసం సోమవారం నాడు ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన జరగడం దైవ సంకల్పమని పేర్కొన్నారు. స్వామివారు ఖమ్మం నగరాన్ని పవిత్రం చేసేందుకు స్వయంగా ఇక్కడకు వస్తున్నారని, ప్రజలందరికీ ఆశీస్సులు అందించనున్నారని తెలిపారు.

ప్రతి భక్తుడు ఆలయ నిర్మాణంలో భాగస్వామి కావాలి:
ఖమ్మంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా విరాళాలు అందించాలని, ప్రతి భక్తుడు ఒక ఇటుక అందించినా ఆలయ నిర్మాణంలో భాగస్వామి అయినట్లేనని అన్నారు.

టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో త్వరలోనే సుందరమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆలయం ఖమ్మం ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచి, భక్తులకు స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి, ఆలయ నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు, టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీరాముడి ఆశీస్సులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తయి ఈ ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖమ్మం ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల కృషి కీలకం:
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభం కావడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాన కారణమని అన్నారు. చిన్నతనంలో విక్రమార్కుడి గురించి చదువు కున్నామని, ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూపంలో అలాంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే ఏడాది కాలంలో ఐదు వేల ఆలయాలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. అలిపిరి వద్ద రూ. 2,700 కోట్లతో సమగ్ర టౌన్‌షిప్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, రద్దీ సమయాల్లో సుమారు 20 వేల మందికి వసతి కల్పించేలా ఈ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ తర్వాత ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి అనుమతి లభించిందని, కరీంనగర్‌లోనూ త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవు తాయని చెప్పారు.

టీటీడీ నిబంధనల ప్రకారం స్థానిక ఆలయ నిర్మాణానికి 25 శాతం నిధులను స్థానిక భక్తులు సమకూర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మంలో సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని టీటీడీకి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

పలువురు ప్రముఖుల విరాళం:
అనంతరం ఆలయ నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతల వివరాలను మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎంపీ బండి పార్థసారథి రెడ్డి రూ. 60.00 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ. 50.00 లక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు రూ. 25.00 లక్షలు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేసిన వ్యక్తి కూడా ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.11 లక్షలు విరాళంగా అందించారు. విరాళాలు ప్రకటించిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తి, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందించి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., కార్యక్రమంలో టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్ కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివ రావు, మట్టా రాగమయి దయానంద్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles