సూర్యాపేట: ఖమ్మం-సూర్యాపేట నేషనల్ హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద వోల్వో కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కొద్దినిమిషాల్లోనే మంటల చెలరేగి కారు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఘటనా స్థలిలో పలువురు చూస్తుండగానే కారులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు.

కారు ప్రమాదపు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన వ్యక్తిని ఖమ్మానికి చెందిన డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు. డాక్టర్ జగదీష్ ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షునిగానూ డాక్టర్ జగదీష్ పనిచేశారు. డాక్టర్ జగదీష్ ఆకస్మిక మరణంతో ఖమ్మం వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కాగా ప్రమాద తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు అత్యంత విషాదకరంగా, భయానకంగా ఉన్నాయి. పాఠకుల్లో సున్నిత మనస్కులను దృష్టిలో ఉంచుకుని ఆయా దృశ్యాలకు సంబంధించిన చిత్రాలను ‘సమీక్ష’ ప్రచురించడం లేదు.

