హైదరాబాద్: పోక్సో కేసులో నిందితునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ బాధిత బాలికను బెదిరించిన ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుపై నిందితుని ఇద్దరు కూతుళ్లపై, కోడలిపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెడితే.. గత జూన్ ఆరో తేదీన ఖమ్మం నగరంలో ఘోర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. పదకొండేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆమెను ఐదంతస్తుల భవనం పైనుంచి తోసివేసిన అమానుష ఉదంతంపై మహ్మద్ గౌస్ పాషా(49) అనే వ్యక్తిపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు ఉద్యమించాయి. బాధిత బాలికకు ప్రస్తుతం ప్రభుత్వమే చికిత్సను అందిస్తోంది.
ఈ కేసుపై ప్రస్తుతం ఖమ్మంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. బాధిత బాలిక తల్లిదండ్రులు న్యాయస్థానంలో తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈనెల 16వ తేదీన బాధిత బాలిక కూడా కోర్టులో తన సాక్యం ఇవ్వాల్సి ఉంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో 16వ తేదీనాటి వాయిదాకు బాలిక హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 5వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే నిందితుడు గౌస్ పాషా కుమార్తెలు మహ్మద్ అస్మా, మహ్మద్ ఆఫ్రిన్ తోపాటు అతని కోడలు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ బెదిరించినట్లు బాధిత కుటుంబీకుల నుంచి అందిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రిలోని ఎఫ్ బ్లాక్ 633 గదికి ముగ్గురు మహిళలు వచ్చారని, వారిలో గౌస్ పాషా కుమార్తెలు ఇద్దరు, కోడలు ఉన్నట్లు గుర్తించినట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తొలుత తమ వల్ల తప్పు జరిగిందంటూ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, అనంతరం నిందితునికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించారనేది ఫిర్యాదు సారాంశం. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక తండ్రి ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు గౌస్ పాషా కుమార్తెలపై, కోడలిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

