హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ నయీమ్ హత్యకు ఖమ్మం నగరంలోనే నిందితులు పథక రచన చేశారని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. ఈనెల 14వ తేదీన రాత్రి నాగోల్ బండ్లగూడలో నయీమ్ ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించిన సందర్భంగా సీపీ సుమతి ఘటనకు దారి తీసిన పరిస్థితులను బుధవారం మీడియా సమావేశంలో వివరించారు.
ఆమె కథనం ప్రకారం.. హత్యకు గురైన నయీమ్, నిందితులు కనకం ఉమామహేష్, సయ్యద్ రబ్బానీ, ఓట్ల దినకర్ ఒకరికొకరు పరియస్తులు. వీరంతా ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నమోదైన పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇటీవల వీరి మధ్య ఏర్పడిన వైరం, బెదిరింపుల కారణంగా నయీమ్ ను అంతం చేయడానికి కనకం ఉమామహేష్, సయ్యద్ రబ్బానీ, ఓట్ల దినకర్ కుట్ర పన్నారు.
ఇందులో భాగంగానే తన మాజీ జైలు సహచరుడైన రసుమల్ల సాకేత్ ను సయ్యద్ రబ్బానీ సంప్రదించాడు. నయీమ్ హత్యకు పథకంలో సాకేత్ వొల్లిపొల్ల మహేష్ ను అతని అనుచరులను చేర్చుకున్నాడు. ఈమేరకు నిందితులు ఈనెల 13వ తేదీన ఖమ్మంలో సమావేశమై, రాత్రి అక్కడే బసచేసి పథకం అమలు గురించి చర్చించారు. అనంతరం 14వ తేదీన హైదరాబాద్ కు తిరిగి వచ్చి రచించుకున్న పథకాన్ని అమలు చేసి నయీమ్ ను దారుణంగా హత్య చేశారు.

ఈ హత్యోదంతంలో మొత్తం 13 మంది నిందితులు కాగా తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సుమతి చెప్పారు. అరెస్టయినవారిలో పుదుచ్చేరి రాష్ట్రం కొత్తపేటకు చెందిన సయ్యద్ రబ్బానీ (21), ఇల్లెందుకు చెందిన ఊట్ల దినకర్ (35), హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన వొల్లిపొల్ల మహేష్ (23), ఛత్రినాకకు చెందిన రసుమల్ల సాకేత్ (26), విద్యానగర్ కు చెందిన ఆలకుంట వెంకట్ (22), చాంద్రాయణగుట్టకు చెందిన కొడిగంటి రాఘవేందర్ (27), ఛత్రినాకకు చెందిన వలపుదాసు చరణ్ గౌడ్ (18), ఖమ్మం కాల్వొడ్డుకు చెందిన మహ్మద్ భద్రుల్లా (44), ఖమ్మంలోని గృహకల్పకు చెందిన తోడేటి వెంకటేష్ (31) ఉన్నట్లు సీపీ వివరించారు.
ఘటనలో మరో నలుగురు నిందితుల్లో ఇల్లెందుకు చెందిన కనకం ఉమా మహేష్ (32), చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ జబి, కొత్తగూడేనికి చెందిన భోలే, ఖమ్మానికి చెందిన కార్తీక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి వేట కొడవలి, ఇనుప కడాయి, టయోటా కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ సుమతి ప్రశంసించారు.

