Top 5 This Week

Related Posts

వినాయక విగ్రహ విక్రేతల అమానుష దాడి: యువకుడి దారుణ హత్య

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం కోసం వచ్చిన ఓ యువకునిపై విగ్రహ విక్రేతలు విచక్షణారహితంగా దాడిచేసి దారుణంగా కొట్టి చంపిన ఉదంతం పండుగపూట బాధితుని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద ఈ ఉదంతం జరిగింది.

వివరాల్లోకి వెడితే.. చౌదరిగూడకు చెందిన కిరణ్ (24) అనే యువకుడు వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరస్వామి విగ్రహం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా విగ్రహాల విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో జరిగిన దాడిలో కిరణ్ అనే యువకునిపై వినాయక విగ్రహ విక్రేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సమీపంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

న్యాయం చేయాలంటూ కిరణ్ బంధువులు, కుటుంబీకుల ఆందోళన

దాడిలో గాయపడిన కిరణ్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే అతను ప్రాణాలు కోల్పోయాడు. విగ్రహం కోసం వెళ్లిన కిరణ్ దాడిలో గాయపడి చనిపోయాడనే వార్త తెలియడంతో అతని బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలంటూ వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆందోళనకారులకు నచ్చజెబుతున్న పోలీసు అధికారి

సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

Popular Articles