Top 5 This Week

Related Posts

ఐదంతస్తుల పైనుంచి తోసేశాడు! ఆ బాలిక బతకడమే ఓ మిరాకిల్, ఖమ్మంలో కామోన్మాది అరెస్ట్

ఖమ్మం: కామోన్మాది లైంగిక దాడిలో బాధితురాలిగా మిగిలిన పన్నెండేళ్ల బాలిక ప్రాణాలతో జీవించి ఉండడం ఓ మిరాకిల్ గా పోలీసు అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడైన డ్రైవర్ మహ్మద్ గౌస్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ప్రకటించారు. ఈ ఘటనలో బాధితురాలి పేరు, వివరాలను బహిర్గతం చేసినవారిపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం నగరంలోని రాపర్తినగర్-2 ఏరియాలోని ఐదంతస్తుల భవనం పైనుంచి నిందితుడు గౌస్ బాలికను కిందకు తోసివేసినట్లు పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. అపార్ట్మెంటు భౌతిక పరిస్థితులను పరిశీలించినపుడు ఈ అంశం వెల్లడైనట్లు చెబుతున్నారు. బాలికపై లైంగిక దాడికి దిగి, తన చర్య బహిర్గతమవుతుందనే కారణంతో నిందితుడు గౌస్ ఆమెను ఐదో అంతస్తును నుంచి కిందకు తోసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అపార్ట్మెంట్ దిగువన ఓ ప్రాంతంలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయని, చుట్టూ ప్రహారీగోడ ఉందని, ఈ రెండు ప్రాంతల్లో ఎక్కడ పడినా బాలిక ప్రాణాలు దక్కేవి కావంటున్నారు. అయితే అదృష్గవశాత్తు బాలిక బతికిందని, గాయాల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభించాక గౌస్ దురాగతాన్ని వెల్లడించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

బాలిక తండ్రితో ఫోన్ లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి

దురాగతంపై స్పందించిన మంత్రి పొంగులేటి:
కాగా ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్పందించారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు బాధిత బాలిక తండ్రితో ఆయన ఫోన్ లో మాట్లాడారు.”ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా” అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.

నిందితుడు గౌస్ (ముసుకు వ్యక్తి)ను అరెస్ట్ చేసిన చిత్రంలో ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి, టూ టౌన్ సీఐ కూడా ఉన్నారు..

చర్చనీయాంశంగా మాజీ కార్పొరేటర్ల తీరు!
కాగా ఈ దురాగతంలో ఓ పార్టీకి చెందిన నలుగురు మాజీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఖమ్మం నగరంలో తీవ్ర సంచలనం కలిగించిన పోక్సో కేసులో నిందితుడైన వ్యక్తికి ముగ్గురు మాజీ కార్పొరేటర్లు అండగా నిలిచేందుకు విఫలయత్నం చేశారనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఐదంతస్తుల భవనం పైనుంచి ఆమెను తోసేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుకున్న ముగ్గురు మాజీ కార్పొరేటర్లు అతన్ని విడిపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈమేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చారని, అయితే కేసు, దాని తీవ్రత నేపథ్యంలో ఈ ముగ్గురు మాజీ కార్పొరేటర్ల యత్నం పోలీసుల ముందు సఫలం కాలేదని సమాచారం. మరో కార్పొరేటర్ కూడా వీరికి జత కలిసేందుకు వచ్చి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ బయట నుంచే చిత్తగించినట్లు తెలుస్తోంది. అమానుష ఘటనలో ఈ నలుగురు మాజీ కార్పొరేటర్ల వ్యవహార శైలిపై ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఆరా తీయడం గమనార్హం.

Popular Articles