హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లతో, పునర్విభజనను కలపడంలో రాజకీయ కుట్ర ఉందన్నారు. నియోజకవర్గాల పునర్వభజనను ప్రధాని మోదీ రాజకీయ పావుగా, ప్రమాదకరంగా వాడుకుంటున్నాడని సీఎం ఆరోపించారు. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచారో మొదట చర్చించాలన్నారు. యాభై శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, నక్సలైట్ లాంటి సమస్యలు వివక్ష వల్లనే వచ్చాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పన్నులు కట్టడం, సలామ్ చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హడావుడి చేస్తోంది.
- కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను రెండింటిని ఒకటిగా చూపించి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు.
- ఈ రెండు అంశాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.
- రెండింటిని విడదీసి వేర్వేరుగా చర్చించి, అమలుపైన, విధివిధానాలపైన ఒక సూచన చేస్తున్నాను.
- రాజ్యాంగంలోనే పురుషులతోపాటు మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
- అప్పటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు.
- పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.
- దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్ గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చాలా రాజ్యాంగ బద్దమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది.
- మహిళల నాయకత్వంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్.
- రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారు.
- సోనియా గాంధీ నాయకత్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారు.. అప్పుడు రాజ్యసభలో ఆమోదించారు.
- బీజేపీ సహకరించకపోవడం వల్లనే లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు.
- ఇంత కాలం మోదీ ఈ బిల్లును పట్టించుకోలేదు.
- 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
- 2026 తర్వాత జనాభా లెక్కల తర్వాత గెజిట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టం చేశారు.
- 2024 లోక్ సభ ఎన్నికల్లో 543 లోక్ సభ సభ్యుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు ఎన్నిక అయ్యేందుకు అవకాశం ఉండేది.
- చట్టాన్ని లోక్ సభలో ఆమోదించినప్పుడే అమలు చేయకుండా పిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లు దూరం చేసింది.
- 2026 జనభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టం ముందుకు తెస్తున్నారు.
- 2026 జనాభా లెక్కల ప్రకారం నిబంధనను సవరించుకుంటే 2029 లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు.
- మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనను కలపడంతో రాజకీయ కుట్ర ఉంది.
- 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు కట్టుబడి ఉంటాం.
- మహిళల రాజకీయ సాధికారితకు కాంగ్రెస్ మొదటి నుంచి కట్టుబడి ఉంది.
- నియోజకవర్గాల పునర్వభజనను ప్రధాని మోదీ రాజకీయ పావుగా ప్రమాదకరంగా వాడుకుంటున్నాడు.
- గతంలో నియోజకవర్గాల పునర్విభజన మూడు సార్లు జరిగింది.
- 1967 లో 520 సీట్లకు పెంచారు, 1976 లో 542 సీట్లకు పెంచారు. తర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543కి పెరిగింది.
- దక్షణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయడం వల్ల జనాభా తగ్గింది.
- ఉత్తరాధిలో కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగింది.
- ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్ సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
- 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు.
- జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరగొద్దనే సీట్లను నియంత్రించారు.
- 2001లో వాజ్ పేయి పునర్విభజనపైన చట్ట సవరణ చేశారు.
- దానివల్ల 2009లో తెలంగాణకు 17 ఎంపీ సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వచ్చాయి.
- తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఏపీకి 175 శాసనసభ సీట్లు పెరిగాయి.
- 2026 వరకు చట్టపరంగా సీట్ల పెంపుపైన నిషేధం విధించారు.
- జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతో పాటు ప్రధానికి లేఖ రాశాయి.
- మేం ఒప్పుకోమని చెప్పడంతోనే దామాషా ప్రకారం అని చెపుతున్నారు.
- యాభై శాతం సీట్లు పెంచుతామని అంటున్నారు.
- 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ యాభై శాతం పెంచితే 90 సీట్లకు గ్యాప్ పెరుగుతుంది.. అంతరం బాగా పెరుగుతుంది.
- తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది.
- దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి.. యాభై శాతం పెరిగితే 195 అవుతాయి.
- 413 సీట్లు ఉత్తరాదిలో ఉన్నాయి, పెంచితే 621 సీట్లు అవుతాయి.
- దక్షణాది, ఉత్తరాది మధ్య అంతరం 412 నుంచి 620 సీట్లకు పెరుగుతుంది.
- బీజేపీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో కీలకమైన శాఖలను ఇవ్వలేదు.
- రాష్ట్రపతి నుంచి కీలకమైన ఏ పదవి ని దక్షణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు.
- బలహీనుడు, బలవంతులు మధ్య చర్చలు జరగవు.. సమాన స్థాయి ఉన్న వారి మధ్య చర్చలు ఉంటాయి.
- రాజకీయంగా ద్వితీయ శ్రేణి రాష్ట్రాలను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య ఉండబోతుంది.. ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాజకీయ మనుగడ కోల్పోతాయి.
- దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీరని విఘాతం.
- ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలో మొదట చర్చించాలి.. యాభై శాతం పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు..?
- రాజకీయ అవసరాల కోసం యాభై శాతం సీట్లు అంటున్నారు.
- దేశ మనుగడకు మంచి కాదు.
- ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదు.. ప్రజలకు సంబంధించింది.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, నక్సలైట్ లాంటి సమస్యలు వివక్ష వల్లనే వచ్చాయి.
- వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
- మహిళా బిల్లు ముసుగులో అడ్డుపడుతున్నారు.. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి.
- ప్రస్తుతం ఉన్న లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.
- దక్షణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు.. ఉత్తరాధి రాష్ట్రాలు రాజకీయ రాజధానులు.
- పన్నులు కట్టడం, సలామ్ చేయడానికి మేం వ్యతిరేకం.
- సీట్ల పునర్విభజనపైన హైబ్రీడ్ మోడల్ ను నేను ప్రపోజ్ చేస్తున్నాను.
- పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం.136 సీట్లు జీఎస్ డీపీ ప్రకారం సీట్ల పునర్విభజన చేయాలి.
- స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి.
- ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపాదికన సీట్లు లేవు.
- 100 శాతం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరగలేదు. ప్రాతినిధ్యం కోసమే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారు.
- దేశానికి దక్షణ భారతదేశం దేశానికి ఆదాయాన్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.
- మమ్మల్ని ఎలా శిక్షిస్తారు.. ?
- విద్యా, ఉద్యోగ అవకాశాల్లో యాభై శాతం రిజర్వేషన్లు, యాభై శాతం మెరిట్ తో చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- అందుకే రిజర్వేషన్లు యాభై శాతానికి మించలేదు.
- సీట్ల పునర్విజభనపైన అఖిలపక్ష సమావేశంతోపాటు అన్ని సంస్థలతో సంప్రదింపులు చేయాలి.
- పార్లమెంటులో పునర్విభజనపైన చర్చించాలి.
- నిపుణలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి.
- అన్ని అసెంబ్లీల్లో చర్చకు పెట్టి పార్లమెంటులో ఆమోదించి నిర్ణయం తీసుకోవాలి.
- 2028 మార్చి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయోచ్చు… హడావుడి గా చేసి దేశంలో దక్షణ, ఉత్తరాది మధ్య గ్యాప్ పెంచొద్దు.

