ఆశా భోస్లే ఆకాశ వీధికి పయనమయ్యారు! అక్క లతా మంగేష్కర్ ఊరుకుంటారా… పిలిపించుకున్నారు! మాట్లాడినా మాట్లాడుకున్నా కళ్లెదురుగా ఉండి తీరాల్సిందే! అక్కా చెల్లెళ్ళ అనుబంధం అలాంటిది! ఎంత సంపాదించినా ఎన్నేళ్లు మాట్లాడుకోకపోయినా బతికినంత కాలం పాతబడిన ప్రభుకుంజ్ అపార్ట్మెంట్ లో ఎదురెదురు ఫ్లాట్స్ లో జీవించారు. రెండు ఫ్లాట్స్ లోనూ ఒకే మెయిడ్ నే మెయింటైన్ చేశారు! ఇక్కడి సమాచారం అక్కడికి, అక్కడి సమాచారం ఇక్కడికి! మొత్తానికి ఇవాళ బాలీవుడ్ పాటల శకం ముగిసిపోయింది. నిన్న చెస్ట్ ఇన్ఫెక్షన్ తో బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే ఆదివారం మధ్యాహ్నం ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు! ఆమె వయసు 92 సంవత్సరాలు. బాలీవుడ్ సంగీత ప్రపంచం మూగవోయింది.
1943లో “మాఝ బాల” మరాఠీ చిత్రంతో ఆమె పాటల ప్రస్థానం ప్రారంభమైంది! 75 ఏళ్ల పాటు పాటలు పాడిన చరిత్ర ఇంకే గాయనికి లేదు! పాటల్లోని 20 ప్రక్రియలు, 24 భాషలు పాడిన ఘనమైన చరిత్ర! వెస్ట్రన్ సంగీతాన్ని వదల్లేదు! ఏకంగా వెస్ట్రన్ బ్యాండ్ ఏర్పాటు చేసి 24 దేశాల్లో షోస్ చేశారు! ఏ అవకాశాన్ని వదులుకోలేదు! సహజంగా ఒకే ఇంట్లో ఇద్దరు సింగర్స్ ఉంటే పైకి ఎలా వున్నా లోలోపల పోటీ బాగా ఉంటుంది! సహజంగా చెల్లెలు వెనకపడుతుంది! కానీ ఆశా భోస్లే పడి లేచే కెరటం! వెనక బడిన ప్రతిసారి తుఫానులా దూసుకొచ్చేవారు!

తన 16వ ఏటనే 31 ఏళ్ల గణ ప్రతాప్ భోస్లేతో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంది! తండ్రి దీనానాథ్ మంగేష్కర్ చనిపోయాక మాణిక్య రాజవంశ కుటుంబానికి చెందిన గణ ప్రతాప్ లతా మంగేష్కర్ కార్యదర్శిగా చేరారు! అతని ప్రేమలో పడింది ఆశా. అక్కడ నుంచే లతతో దూరం పెరిగింది! చునారియా సినిమా కోసం 1948లో ఆమె పాడిన “సావన్ ఆయా” పాట బాలీవుడ్ లో ఆశ పాడిన తొలి పాట! ఆరంభంలో లత పెద్ద సినిమాలకు పాడితే, ఆశ లోబడ్జెట్ సినిమాలకు పాడే వారు. 1952లో విడుదలయిన సంగ్దిల్ చిత్రం ఆశకు మంచి బ్రేక్ ఇచ్చింది! ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగిపోయింది! అదే ఏడాది ఓపి నయ్యర్ “చమ్ చమా చమ్మ” పాట హోరెత్తిపోయింది! 1956 వరకు ఆ హవా కొనసాగింది. అదే ఏడాది నయా దౌర్ సినిమా ఆశకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది! 1960లో అనుమానంతో భర్త ప్రతాప్ దూరమైపోయాడు! 1970 వరకు నయ్యర్ తో జోడీ కొనసాగింది! ఆశా ఏ తరహా పాట అయినా ఇట్టే పాడేసే వారు! క్లబ్ సాంగ్స్ అయితే ఆశానే పాడాలంటూ ఆమె డేట్స్ కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. పియా తో అబ్ తో ఆజా, ఓ హసీనా జుల్ఫోంవాలి, ఓ మేరా సోనా రే, దమ్మరి దమ్ లాంటి పాటలు మస్తు దుమ్ము రేపాయి! తీస్రి మంజిల్ రాహుల్ దేవ్ బర్మన్ తో సూపర్ హిట్ అయ్యింది. అంతే వారి మనసులు కలిసాయి! అప్పటికే ఇద్దరి తొలి పెళ్లిళ్లు పెటాకులు అయి ఉన్నాయి! తన కన్నా ఆరేళ్ళ చిన్నవాడైన బర్మన్ ను 1980లో వివాహం చేసుకున్నారు ఆశ! బర్మన్ 330 పైగా సినిమాలు చేశాక అవకాశాలు తగ్గాయి! అనుమానాలు పెరిగాయి! మందుకు బానిసయ్యాడు! 1996లో చనిపోయారు.
1995 ఆశకు టర్నింగ్ పాయింట్! ఎ.ఆర్.రెహమాన్ దర్శకత్వంలో రంగీలా రే, తన్హా తన్హా పాటలు పాడే అవకాశం వచ్చింది! అప్పుడామె వయసు 62 సంవత్సరాలు. 23 ఏళ్ల హీరోయిన్ ఊర్మిళకు పాడి సంచలనం సృష్టించారు. ఆ పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇలా తన కెరీర్ లో వేలాది పాటలు, ఆల్బమ్స్, స్టేజ్ షోలతో బాలీవుడ్ లో ఎదురుగాలిలో సైతం చెక్కు చెదరని ముద్ర వేసుకున్నారు. ఆమె పాడిన పాటల్లో నా ఫెవరేట్ సాంగ్స్ చాలా ఉన్నాయి కానీ, దమ్మరి దమ్, పియా తూ ఆజా, పరదేమే రహనేదో, తన్హా తన్హా, చందమామ సినిమాలోని నాలో ఊసులకు ఎన్నో ఆశలు రేపావు ఈ పాటలు నాకు చాలా ఇష్టం!

1955లో అమానత్ చిత్రంలో నటించిన ఆశా భోంస్లే 58 ఏళ్ల తరువాత 2013లో “మై” అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. 2020 వరకు పాడుతూనే వున్నారు. ఆమెకు వంట వండటం చాలా ఇష్టం! వెరైటీ వంటకాలు చేసి లతకు పంపించే వారు! ఆ అలవాటు ఏ స్థాయికి చేరిందంటే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ముంబయితో పాటు దుబాయ్, కువైట్, బహరైన్, అబుదాబి, లండన్ లలో ఆశాస్ కిచెన్ పేరిట రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా అనేక మాల్స్ లో అవుట్ లెట్స్ ఇచ్చారు. రెస్టారెంట్ ఇంటీరియర్ నుంచి చెఫ్స్ కు ట్రైనింగ్ వరకు ఆమె దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. చెఫ్ గా ఉద్యోగం కావాలంటే తన ఇంట్లో తన సమక్షంలో రెండు నెలలు శిక్షణ పొందాలి.
ఆశా భోస్లేకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. రవీంద్రభారతి, లలిత కళా తోరణం, శిల్ప కళా వేదికలో సంగీత విభావరిలు చేశారు. ఓ.పి.నయ్యర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు మూడు రోజుల పాటు నేను తోడు ఉండాల్సి వచ్చింది బేగంపేట్ లో ఒక గెస్ట్ హౌస్ లో! ఆయనకు ఉదయం లేచినప్పటి నుంచి బీర్ తాగడం అలవాటు. పీక్స్ కు చేరుకున్నాక ఆశను గుర్తు చేసుకుని భోరున ఏడ్చే వారు! ఆశా గురించి నాతో అనేక జ్ఞాపకాలు పంచుకున్నారు. 2007లో ఒకసారి అభినందన రమణమూర్తి గారు 12 చెన్నై సిల్క్ పట్టు చీరలు నాకు ఇచ్చి, ముంబయి వెళ్లి లత మంగేష్కర్ కు ఇచ్చి రమ్మన్నారు. నేను వెళ్లి లత ఫ్లాట్ బెల్ ఎన్ని సార్లు కొట్టినా డోర్ తీయలేదు. లాభం లేదని ఆశా భోస్లే ఫ్లాట్ లోకి వెళ్ళాను. ఆశా గారితో మాట్లాడుతుండగా లత పని మనిషి తలుపు తీశారు. అప్పటికే తీసుకెళ్లిన చీరల ప్యాక్ ఆశకు ఇచ్చేసాను. వెనక్కి అడగలేని పరిస్థితి! కాసేపయ్యాక లత గారిని కలసి జరిగిన విషయం చెప్పాను. ఆమెకు బీపీ కట్టలు తెంచుకుంది. రమణమూర్తి గారికి ఫోన్ చేసి “యే క్యా హై” అంటూ నిష్టురమాడింది! కొన్నాళ్ళు రమణమూర్తితో ఆమె మాట్లాడలేదు. అలాగే ఇంకోసారి 2010లో అనుకుంటా… రమణమూర్తి గారికి అక్కా చెల్లెళ్లు ఇద్దరిని ఒకే వేదిక పైకి తీసుకు రావాలనే కోరిక. మాట్లాడి రమ్మని నన్ను పంపించారు. ఈసారి ఎందుకైనా మంచిది అని ముందుగా లత గారికి విషయం చెప్పాను. తను వస్తానంటే నాకు అభ్యంతరం లేదు అన్నారు. ఆశ ఫ్లాట్ కు వెళ్లి అడిగాను. తనకు కుదరదు రాలేనని చెప్పేసారు. అక్కా చెల్లెళ్ళ మధ్య నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. అవి ఇంకోసారి గుర్తు చేస్తాను. అప్పట్లో వారిద్దరి కథే సాజన్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ కు రెండు జడలు లతలా! లత ఆ సినిమాను పట్టించుకోలేదు కానీ, ఆశ మాత్రం అదొక పిచ్చి సినిమా అని కొట్టి పారేశారు!

లత లతే, ఆశ ఆశే! ఇద్దరివీ మధుర స్వరాలే! ఇద్దరికి వేలాది సూపర్ హిట్స్ ఉన్నాయి! కానీ, ఆశ ఎదురీదారు! లతకు అవకాశాలు వెతుక్కుంటూ ఎదురొచ్చాయి, అంతే తేడా! లత వివాహం చేసుకోలేదు. ఆశ మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి వివాహంతో ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి హేమంత్ పైలట్ గా పని చేశారు. కొన్నాళ్ళు సంగీత దర్శకత్వం వహించారు. 2012లో కేన్సర్ తో చనిపోయారు. కుమార్తె వర్ష జర్నలిస్ట్, 2015లో తన 56వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నబ్బాయి ఆనంద్ తల్లి బాగోగులు, వ్యాపారాలు చూసుకుంటూ వున్నారు. మనవడు చేతన్ మ్యూజిక్ కంపెని పెట్టాడు. మనవరాలు జునై యాపిల్ స్టోర్స్ పెట్టుకుంది. ఆమె కూడా గాయని, కథక్ కళాకారిణి.
ఆశా భోస్లేను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కె అవార్డులతో గౌరవించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించాయి. ఇక జాతీయ సినిమా పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పౌర సన్మానాలు లెక్కే లేవు! 2011లో అత్యధిక సంఖ్యలో స్టూడియో మ్యూజిక్ రికార్డులు అంటూ గిన్నిస్ బుక్ రికార్డులో ఆమె చోటు చేసుకున్నారు. మహారాష్ట్ర లోని మూడు యూనివర్సిటీలు, మధ్యప్రదేశ్ యూనివర్సిటీ కూడా గౌరవ డాక్టరెట్ లు ప్రదానం చేసి గౌరవం రెట్టింవు చేసుకున్నాయి. ఎన్నో వేల పాటలు పాడి సువర్ణ అక్షరాలతో తన పేరు రాసుకున్న ఆశా భోంస్లే లేకున్నా ఆమె పాట తరతరాలుగా వినిపిస్తూనే ఉంటుంది! ఆశా జీ అల్విదా… ఇక సెలవ్.

✍️ డా. మహ్మద్ రఫీ

