Top 5 This Week

Related Posts

అత్యంత శక్తివంతమైన ఏకాకి..గా మారుతున్న అమెరికా!

డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ముందుకు తీసుకువచ్చిన ‘అమెరికా ఫస్ట్’ విధానం ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. ఈ ధోరణి ఆ దేశాన్ని అంతర్జాతీయ వేదికపై అత్యంత శక్తివంతమైన ఏకాకిగా మారుస్తోంది. అమెరికా తన మిత్రదేశాలను కేవలం వ్యాపార భాగస్వాములుగా చూడటం, రక్షణ వ్యయాలకోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు దశాబ్దాల నాటి నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా నాటో కూటమిలోని ఐరోపా దేశాలు అమెరికా రక్షణ కవచంపై తమకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాయి.

అమెరికా ఎప్పుడైనా తమను వదిలేయవచ్చనే భయంతో జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇతర వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది పాశ్చాత్య దేశాల ఐక్యతను దెబ్బతీస్తూ, పరోక్షంగా రష్యా వంటి ప్రత్యర్థి దేశాలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అమెరికా తన పట్టును వేగంగా కోల్పోతోంది. పారిస్ పర్యావరణ ఒప్పందం వంటి అంతర్జాతీయ వేదికల నుండి అమెరికా వైదొలగడం ఆ దేశంపై ఉన్న నైతిక గౌరవాన్ని తగ్గించింది.

ఇదే సమయంలో చైనా తన ఆర్థిక పారిశ్రామిక శక్తిని ఉపయోగించి ఆయా దేశాలకు దగ్గరవుతోంది. అమెరికా తన వీసా విధానాలను కఠినతరం చేయడం, విదేశీ సహాయాన్ని తగ్గించడం వల్ల ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి.

దక్షిణ ఆసియాలో కీలక భాగస్వామి అయిన భారత్ కూడా అమెరికా యొక్క అనిశ్చిత వైఖరిని గమనిస్తోంది. వాణిజ్యపరమైన సుంకాలు, సాంకేతిక బదిలీల్లో ఆంక్షలు వంటివి భారత్ వంటి దేశాలను తమ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం రష్యా లేదా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి.

గల్ఫ్ దేశాల విషయంలో కూడా ట్రంప్ అనుసరించిన ఇరాన్ వ్యతిరేక విధానం ఆ ప్రాంతాన్ని యుద్ధ మేఘాల కింద ఉంచి, చమురు సంక్షోభానికి దారితీస్తోంది, ఇది ప్రపంచ దేశాలన్నింటికీ ఆందోళన కలిగిస్తున్న అంశం.

అమెరికా లోపల కూడా ఈ విధానం తీవ్రమైన అసమ్మతికి కారణమవుతోంది. ఇజ్రాయెల్ వంటి దేశాలకు ట్రంప్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, ఆ నిర్ణయాలు మధ్యప్రాచ్యంలో శాంతిని మరింత దూరం చేస్తున్నాయని అక్కడి మేధావి వర్గం భావిస్తోంది. స్వదేశంలో అమెరికా ప్రజలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. చివరకు ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో కూడా అంతర్గత సంఘర్షణ మొదలైంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని, అంతర్జాతీయ నాయకత్వాన్ని బలంగా నమ్మే పాత తరం రిపబ్లికన్ నేతలు ట్రంప్ తీసుకున్న రక్షణవాద విధానాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కడం వల్ల భవిష్యత్తులో అమెరికా ఇచ్చే ఏ హామీనైనా ఇతర దేశాలు నమ్ముతాయా? అనే ప్రశ్న వారిని వేధిస్తోంది.

చివరకు అమెరికా ఫస్ట్ అనే నినాదం అమెరికాను ప్రపంచానికి దూరంగా నెట్టి, ఒంటరిగా మారుస్తోంది. గుత్త పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం దూకుడుగా ముందుకు పోతున్న ట్రంప్ ఆర్థిక, రాజకీయ, మిలిటరీ విధానాలు అమెరికా తన శక్తిని తన మిత్ర దేశాల శక్తిని కోల్పోవడమే నేటి అమెరికా వర్తమాన, భవిష్యత్తుగా ఉండబోతున్నది.

Popular Articles