Top 5 This Week

Related Posts

ఛీటింగ్ ఆరోపణల్లో ఇల్లెందు ‘గోల్డ్ మ్యాన్’

(సమీక్ష ప్రత్యేక కథనం)
మెడలో బంగారు ఆభరణపు దండ, చేతివేళ్లు ఖాళీ లేకుండా గోల్డ్ ఉంగరాలు, కుడి చేతికి కనకపు కడియం ధరించిన ఈ వ్యక్తి గుర్తున్నాడా? గుర్తుకు రాకుంటే ఓసారి గత వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్టుమెంట్ లో జరిగిన వినాయక లడ్డూ వేలంలో రూ. 51,77,777 మొత్తానికి లడ్డూను దక్కించుకున్నదెవరో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. అయినా గుర్తుకు రాకుంటే 2024లోనూ రూ. 29.00 లక్షలకు ఇదే లడ్డూను దక్కించుకున్నదెవరో ఓసారి రీకాల్ చేసుకోండి.. టీవీల్లో, పత్రికల్లో వచ్చిన వార్తల్లోని వ్యక్తిగా చూసినట్టే ఉందిగానీ, గుర్తుకురావడం లేదనుకుంటున్నారా?

వేలంలో దక్కించుకున్న లడ్డూతో కొండపల్లి గణేష్ (ఫైల్ ఫొటో)

అయితే చదవండి.. ఇతని పేరు కొండపల్లి గణేష్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. కేవలం రియల్ వ్యాపారమే కాదు, లిక్కర్ సిండికేట్, ఇసుక దందా వంటి అనేక వ్యాపకాలు ఇతనికి ఉన్నాయి. అయితే ఏంటీ.. అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కత.. సూర్యాభాయ్ అనే ఓ గోల్డ్ మ్యాన్ నిన్నంతా వార్తాంశాల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే కదా! అతను ధరింంచినదంతా బంగారం కాదనే సారాంశంతో వార్తలు వచ్చాయి కూడా.

కొండపల్లి గణేష్ (ఫైల్ ఫొటో)

కొండపల్లి గణేష్ ధరించిన వస్తువులు నిజమైన బంగారమే కావచ్చు గానీ, ఇప్పుడీ రియల్ వ్యాపారి ఛీటింగ్ ఆరోపణల్లో చిక్కుకోవడమే అసలు కథ. ఇల్లెందు పోలీసులకూ ఇతనిపై ఛీటింగ్ ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు అందాయి. ఖమ్మం నగరానికి చెందిన పలువురు లిక్కర్ వ్యాపారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొండపల్లి గణేష్ అలియాస్ ఇల్లెందు గోల్డ్ మ్యాన్ పై ఛీటింగ్ ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఇల్లెందు పోలీసులను అభ్యర్థించారు.

తమకు లాభాల ఆశ చూపి, తమ నుంచి రూ. లక్షల్లో పెట్టుబడులు స్వీకరించి, లిక్కర్ షాపులు నిర్వహిస్తూ తాను మాత్రం డబ్బు పోగేసుకుంటూ, తమను మోసం చేస్తున్నాడనేది ఖమ్మం నగరానికి చెందిన లిక్కర్ వ్యాపారులు గణేష్ పై చేసిన ప్రధాన ఆరోపణ. వైన్ షాపుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న లిక్కర్ సిండికేట్ లో భాగస్వాములుగా ప్రకటించుకున్న గోవిందరావు, బబ్బూరి శ్రీనివాసరావు, చల్లా రామారావు, అర్వపల్లి లక్ష్మీనారాయణ, లగ్గాల పురుషోత్తం, పెరుమళ్లపల్లి సరితా ప్రసాదరావు, కందుల బేబీ ప్రసూన, దారా ఉమామహేశ్వరరావు, రమాగిరి శణ్ముఖరాజు, వీపూరి శ్రీనివాస్ లు మీడియా సమావేశంలో గణేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

గణేష్ పై ఆరోపణలు చేసిన ఖమ్మానికి చెందిన లిక్కర్ వ్యాపారులు

వైన్ షాపుల టెండర్లు, డ్రాల సమయంలో మొత్తం 154 మంది నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేశాడని, వైన్ షాపుల కోసం 154 టోకెన్లు కొనుగోలు చేసి డ్రాలో పాల్గొన్నట్లు చెప్పారు. వైన్ షాపుల డ్రాలో ఇల్లెందు పట్టణంలో నాలుగు షాపులు రాగా, తొలుత ఒక్కొక్కరి నుంచి రూ. 3.00 లక్షలు, రూ. 5.00 లక్షల చొప్పున తీసుకుని, ప్రతీ నెలా తమకు లాభాలు పంచి ఇస్తానని, పెట్టుబడికి రెట్టింపు ఇస్తానని, రూపాయికి రూపాయికి లాభం ఇస్తానని తమతో గణేష్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తమనందరినీ డ్రాలో గెలిచిన లిక్కర్ షాపుల్లో భాగస్వాములుగా అగ్రిమెంట్లు చేశాడన్నారు. తొలుత ఖమ్మం వాటాదారుల నుంచి 14 టోకెన్లకు రూ. 70.00 లక్షలు తీసుకున్నాడని, ఇల్లెందులో మరో వైన్ షాపు కొనుగోలు పేరుతో మరికొందరి నుంచి సుమారు రూ. 90.00 లక్షలు తీసుకున్నాడన్నారు.

అయితే ఒప్పందం ప్రకారం తమకు ఆదాయ, వ్యయాలు చూపకుండా, కనీసం తమను కలవకుండా, ఫోన్ కూడా ఎత్తకుండా తిరుగుతూ మోసగిస్తున్నాడని ఖమ్మం వ్యాపారులు ఆరోపించారు. ఒకటీ, అరా సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేసినప్పటికీ, సిండికేట్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బుకాయిస్తున్నాడని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని దబాయిస్తున్నాడని, గత్యంతరం లేక గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఇదే సందర్భంలో పట్టణంలోని గణేష్ వైన్ షాపులకు ఈ భాగస్వామ్య వ్యాపారులు తాళాలు వేశారు. సిండికేట్ కు చెందినట్లుగా భావిస్తున్న నాలుగు వైన్ షాపులకు కూడా వీళ్లు తాళాలు వేయడం గమనించాల్సిన అంశం.

ఇల్లెందులోని ‘గణేష్’ వైన్స్ షాపునకు తాళం వేస్తున్న భాగస్వామ్య వ్యాపారులు

ఇదిలా ఉండగా, బానోత్ గోపీచంద్ అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కూడా కొండపల్లి గణేష్ పై పోలీసులకు మరో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. వైన్ షాపు టెండర్లకోసం తన వద్ద గణేష్ రూ. 64,44,000 తీసుకుని, లాభాల వాటా ఇవ్వకుండా మోసం చేశాడనేది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గోపీ చంద్ చేసిన ఆరోపణ.

ఓల్డ్ సిటీకి చెందిన సూర్యాభాయ్ తన ఒంటిపై ధరించిన నగలన్నీ బంగారం కాదని, బంగారు పూత మాత్రమేనని ఐటీ అధికారులు తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఇల్లెందు గోల్డ్ మ్యాన్ గా ప్రాచుర్యం పొందిన కొండపల్లి గణేష్ లిక్కర్ సిండికేట్ దందాపై ఛీటింగ్ ఆరోపణలు రావడం, పోలీసులకు ఫిర్యాదులు అందడం గమనార్హం. చూడాలి ఇల్లెందు గోల్డ్ మ్యాన్ దందాల్లో ఇంకెన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తాయో..!

Popular Articles