Top 5 This Week

Related Posts

భద్రాచలం టెంపుల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు.

ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం నిర్దేశించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి, అందుకు సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు.

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరీక బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular Articles