కరీంనగర్: ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నరు. వాళ్లందరినీ తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నడు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్ లు పెడుతున్నరు. వాళ్లను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుంది’’ అని ఆయన అన్నారు.
ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని అన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని చెప్పారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు.
గురువారం కరీంనగర్ కు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసంలో మీడియాతో, స్థానిక నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వందేమాతరం గేయ ఆలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేల బహిష్కరించడం దుర్మార్గమని సంజయ్ అన్నారు. భారత జాతీయ గేయాన్ని, భారతమాతను అవమానించారన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులను మజ్లిస్ ధిక్కరించడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.
‘సభలో గవర్నర్, సీఎం, స్పీకర్, మండలి ఛైర్మన్ సహా సభ్యులంతా ఉన్నారు. శాసనసభలో సభ్యులు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఒక్క స్పీకర్ కు మాత్రమే ఉంది. ఎందుకంటే స్పీకర్ శాసనసభ కస్టోడియన్. అయినా ఇంతవరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పుపట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడింది. ఈ తరుణంలో వందేమాతరం ఆలాపనను మజ్లిస్ బహిష్కరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శాసన వ్యవస్థపట్ల, స్పీకర్ పట్ల ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. స్పీకర్ కు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలుసా? అధికారులైనా ఆయన ద్రుష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా?’ అని సంజయ్ నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాననసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం మెడలు పట్టి తప్పనిసరిగా వందేమాతరం ఆలపించేలా చర్యలు తీసుకునేవాళ్లమన్నారు. భారతీయ పౌరులంతా వందేమాతరం ఆలపించాల్సిందేనని పేర్కొన్నారు. ఎవరైతే వ్యతిరేకిస్తే వాళ్లను కటకటాల్లోకి నెట్టి భారతీయత అంటే ఏమిటి? భారతీయత గొప్పదనం ఏమిటో చూపించేవాళ్లమని అన్నారు.
దమ్మున్న పార్టీ, దమ్మున్న ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటివి చేయగలమని, మజ్లిస్ మోచేతి నీళ్లు తాగే పార్టీలు అధికారంలో ఉన్నవి కాబట్టే స్పందించడం లేదన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా స్పీకర్ వ్యవహరిస్తే ఎలా? శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే చూసీచూడనట్లు ఉంటే సభ హుందాతనాన్ని కాపాడేదెవరు? ప్రజాస్వామ్యవాదులంతా మజ్లిస్ తీరును ఖండించాలి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి గుణం పాఠం చెప్పాలి. అంతేగాదు, బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలు పడుకున్నా వందేమాతరం గుర్తుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
‘ఏపీలో లడ్డూ గురించి, తెలంగాణలో మూసీ గురించే చర్చ జరుగుతోంది. నేను మళ్లీ చెబుతున్నా. భారతీయ జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే బీజేపీ వ్యతిరేకం…. నిన్న సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మూసి నిర్వాసితులందరికీ ఆ ప్రాంతంలోనే ఇళ్ల కట్టించి, పునరావాస సాయం అందించి మెరుగైన ఆసుపత్రులు అక్కడే నిర్మించి, ప్రతి చోట మురుగు నీటి శుద్ది కేంద్రాలు (ఎస్టీపీలు)ను ఏర్పాటు చేసి, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తామని చెప్పారు. నేను డిమాండ్ చేస్తెన్నా. అవన్నీ కట్టిన తరువాతే మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలి. ఈ విషయంలో గుజరాత్ సబర్మతి నది తరహాలో ప్రక్షాళన చేయండి. ఒక్కసారి సబర్మతికి వెళ్లి స్టడీ చేయండి. అట్ల కాకుండా పేదల ఇండ్లు కూల్చి రోడ్డు పాల్జేస్తామంటే బుల్డోజర్లకు అడ్డంగా నిలుస్తాం’ అని బండి సంజయ్ప పేర్కొన్నారు.

