హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదన్నారు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మొదటి దశలో భాగంగా ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు సకల వసతులతో శాశ్వత భవనాల నిర్మించాలని, రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాల పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు ఒకే మోడల్‌లో, ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా డిజైన్ చేయాలని చర్చించినట్లు చెప్పారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పారు. గచ్చిబౌలి, మేడ్చల్, పఠాన్ చెరువులలో ఇప్పటికే అత్యాధునిక సమీకృత భవనాల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు.
గత ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా మండలాలు విభజించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త మండలాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి రెవెన్యూ సేవలను బలోపేతం చేశామన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి సామాన్యుడికి గౌరవప్రదమైన పాలన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

