Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం భూదాన్ భూముల్లో SDRF, పోలీసుల దృశ్యాలు

ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మంగళవారం ఉదయం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూదాన్ బోర్డుకు చెందిన ఈ భూముల్లో గ్రామీణ పేదల సంఘం తరపున నిర్మించుకున్న నివాసాలను ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచేగాక, ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 4,00 మంది పోలీసు బలగాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన SDRF బలగాలు రంగప్రవేశం చేసి కొందరు ఆక్రమించుకున్న భూదాన్ భూములను ఖాళీ చేయిస్తున్నారు.

దాదాపు 31.00 ఎకరాల్లో గ్రామీణ పేదల సంఘం తరపున ఎనిమిదేళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లనుంచి నివాసితులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ అంశంలో నెలకొన్న వివాదానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భూదాన్ బోర్డు భూముల నుంచి నివాసితులను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ఓ పది ఇండ్లకు సంబంధించి మాత్రం వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఉండడంతో, మిగతా దాదాపు 600 కుటుంబాలను ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.

ఈ సందర్భంగా నివాసితుల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఉద్రిక్త పరిస్తితులేవీ ఏర్పడలేదని పోలీస్ నిఘా వర్గాలు ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూ పోలీసులకు శ్రమ కలిగించకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Popular Articles