Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఆ తల్లీ, పిల్లల ఆత్మహత్య వెనుక..!? నేటి న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ, ఓ విశ్లేషణ

(సమీక్ష ప్రత్యేకం)
హైదరాబాద్ చర్లపల్లి సమీపంలో విజయారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వార్త చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది .

ఈ ఘటనను కాస్త లోతుగా పరిశీలిస్తే పూర్తిగా నివారించదగిన మరణాలుగా కనిపిస్తాయి. ఎవరైనా ముందే గుర్తించి సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లి ఉంటే వారి జీవితాలకు ఇటువంటి విషాదకరమైన ముగింపు ఉండేది కాదు.

విజయ భర్త సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా నాలుగేళ్లుగా దుబాయిలో ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈమె ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నారు. రాత్రి పూట డ్యూటీ అవడంతో పిల్లలను హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది.

ఒంటరితనం కారణంగా ఆమె తీవ్రమైన కుంగుబాటుకు గురైందని బంధువులు అంటున్నారు. మరి పిల్లలు ఇద్దరిని బలవన్మరణాలకు ఎలా ఒప్పించగలిగింది?

కౌమార దశలోని పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అనాథలైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబంలో హింసకు గురవుతున్నా చనిపోవాలనే ఆలోచన రాదు వాళ్లకు. మరి తల్లి మాటను అంత గుడ్డిగా ఎందుకు నమ్మారు?

  • తండ్రిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి రిలేషన్ పరంగా దూరమయ్యారా?. వీరితో సంబంధాలు తెంపుకున్నారా? తన సంపాదనను భార్యకు పంపించడం లేదా? ఆమె అంత డిప్రెషన్ లో ఉంటే ఫోన్ సంభాషణల్లో ఆయన ఎందుకు గుర్తించలేకపోయారు. ఇక్కడే కుటుంబంతో ఆయనకు ఏదో గ్యాప్ ఉందనే అనుమానం కలుగుతోంది. (మనం సురేందర్ తో మాట్లాడితే ఆయన ఏం చెబుతారో తెలియదు)
  • పిల్లలను హాస్టల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో విజయ ఏం చెప్పి ఉంటుంది? ఏదైనా అత్యవసరమని తల్లి చెబితె వాళ్లు తండ్రితో ఎందుకు పంచుకోలేకపోయారు?
  • సాధారణంగా మహిళలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తన తర్వాత పిల్లల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ఆలోచిస్తారు. (కొన్ని సందర్బాల్లో భర్తకు కోలుకోలేనంత దు:ఖాన్ని మిగిల్చి పోవాలనే పంతం కూడా ఉంటుంది.)
  • తల్లిదండ్రులు లేని పిల్లలు ఏదో విధంగా జీవించే అవకాశం ఉన్నా, అసలు తట్టుకోలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భ్రమ పడతారు. ఇది తీవ్రమైన డిప్రెషన్, సైకోసిస్ వల్ల తీసుకునే పొరపాటు నిర్ణయం.
  • తన తర్వాత వాళ్లను ఎవరు చదివిస్తారు? ఆర్థికంగా, సామాజికంగా వారు అనాథలుగా మిగిలిపోతారని భావిస్తారు. ఇదంతా పిల్లలతో ఆత్మహత్యల ఒప్పందం చేసుకోవడానికి దారి తీస్తుంది. మనస్తత్వశాస్త్రంలో దీనిని Altruistic filicide అని పిలుస్తారు.
  • తల్లిదండ్రుల మధ్య సంబంధాలు లేని కుటుంబాల్లో పిల్లలు కూడా మానసిక ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression)కు గురవుతారు. తల్లి తరచూ రోదిస్తూ ప్రేమానురాగాలు లేని తమ దైన్య స్థితిని పిల్లలతో పంచుకోవడం వల్ల వారూ ఆందోళనతో ఉంటారు.
  • మరి ఏం చేయాలి?
  • ఎంత పెద్ద ఉద్యోగమైనా, వ్యాపారమైనా భార్యా భర్తలు రెండు మూడు నెలలకు మించి దూరం ఉండే పరిస్థితి రాకుండా చూసుకోవాలి.
  • తల్లిదండ్రుల్లో ఒకరు సుదీర్థ కాలం పాటు దూరంగా ఉండటం వల్ల పిల్లలు తమ భావోద్యోగాలను పంచుకోలేని లోటు తెలుస్తుంది.
  • దూరం…భార్యా భర్తల మధ్య మూడో వ్యక్తి దూరే పరిస్థితిని సృష్టిస్తుంది.
  • ఎడబాటు, కేవలం లైంగిక అవసరాల పరంగానే కాకుండా మానసిక సాంత్వన దొరకకుండా చేస్తుంది. కొన్ని ఉద్వేగాలను ఫోన్లో, వాట్సాప్ వీడియో కాల్ లో పంచుకోలేరు.
  • పురుషులు మద్యం సేవించో మరో వ్యాపకంతోనో కొంతవరకు ఒంటరితనాన్ని అధిగమించగలుగుతారు.
  • మహిళల మానసిక స్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
  • డబ్బు కొరత లేకున్నా, ఇంటి పెద్ద దగ్గర లేకపోవడం కొన్ని సందర్భాల్లో తీరని వెలితిని చూపిస్తుంది.
  • పెళ్లయి పిల్లలున్న దంపతులు కొద్ది కాలంగా విడిగా ఉండాల్సి వచ్చినా నెలలు, ఏళ్ల తరబడి ఉండటం ఇప్పటి న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థలో అనేక దుష్ఫరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి.

Popular Articles