Top 5 This Week

Related Posts

రాంగ్ ఇంజక్షన్!?: 17 మంది పిల్లలు ఐసీయూ పాలు

నల్గొండ: ఒక ఇంజక్షన్ కు బదులు మరో ఇంజక్షన్ ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణల ఘటనలో 17 మంది చిన్నారులను ఐసీయూలోకి తరలించాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఫలితంగా తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైరల్ ఫీవర్ వల్ల ఇటీవలే ఈ చిన్నారులు సాగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

పీడియాట్రిక్ వార్డులో గల చిన్నారులకు రోజూలాగే శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. అయితే ఓ అరగంట తర్వాత ఇంజక్షన్ తీసుకున్న చిన్నారులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. దీంతో బాధిత పిల్లలను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యవర్గాలు చెప్పాయి. కాగా ఒక ఇంజక్షన్ కు బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చిన్నారుల తల్లిదండ్రులు వైద్యులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం.

Popular Articles