Top 5 This Week

Related Posts

ఆర్థిక నేరాల్లో న్యూస్ ఛానల్ MD!? బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్!

హైదరాబాద్: బంజారాహిల్స్ ప్రాంతంలో గల ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏవేని ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడా? ఇదే నిజమైతే అతను పాల్పడిన ఆర్థిక నేరాలేమిటి? వాటి తీవ్రత ఎంత? విదేశీ నిధులను అతను అక్రమ మార్గంలో స్వీకరించాడా? లేక చేసిన అప్పులు చెల్లించలేక చేతులెత్తేశాడా? కాదంటే బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాల మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించాడా? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు రేకెత్తుతున్నాయంటే..? సదరు న్యూస్ ఛానల్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కులను సంబంధిత బ్యాంకు తిరస్కరిస్తోంది. చెక్కుల తిరస్కరణకు గల కారణాలను బ్యాంకు కూడా స్పష్టం చేస్తుండడం గమనార్హం. సంబంధిత ఉద్యోగులు క్లియరెన్స్ కోసం సమర్పించిన చెక్కులను తిరస్కరించడానికి గల కారణాన్ని పేర్కొంటూ ‘Payment stopped by attachment-Court order’ అని స్పష్టంగానే చెబుతోంది.

వాస్తవానికి ఈ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా వేధిస్తున్నాడనే అరోపణలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆందోళనకు దిగిన కొందరు ఉద్యోగులకు ఛానల్ ఎండీ తన సంతకంలో కూడిన చెక్కులను ఇచ్చారు. వీటిని అందుకున్న ఉద్యోగుల్లోని ఓ జర్నలిస్ట్ గత సెప్టెంబర్ 29వ తేదీన చెక్కును తన బ్యాంకు ఖాతాలో జమ చేయగా, చెక్కు ఇచ్చిన ఛానల్ సంస్థ అకౌంట్ లో సరైన నగదు నిల్వలు లేని కారణంగా పేమెంట్ తిరస్కరిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. అయినప్పటికీ ఆయా జర్నలిస్ట్ గత నెల 23వ తేదీన మరోసారి చెక్కును తన బ్యాంకు ఖాతాలో చెల్లింపులు జరిగేందుకు సమర్పించారు. ఈసారి బ్యాంకు నుంచి వచ్చిన రశీదును చూసి సదరు జర్నలిస్ట్ నివ్వెరపోయారు. ఎందుకంటే కోర్టు ఆదేశం కారణంగా చెక్కును తిరస్కరిస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

కోర్టు ఆదేశంతో చెల్లింపు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న బ్యాంక్ (రెడ్ సర్కిల్ లో)

ఈ పరిణామాల్లో సదరు న్యూస్ ఛానల్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయినట్లు తెలుస్తోంది. ఖాతాను స్తంభింపజేసిన పరిస్థితుల్లోనే చెక్కులకు ఇటువంటి తిరస్కరణ ఎదురవుతుందని బ్యాంకు అధికారవర్గాలు చెబుతున్నాయి. పలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినపుడు కూడా అకౌంట్ ఫ్రీజ్ చేయవచ్చంటున్నారు. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు, మోసం లేదా సైబర్ నేరాల వంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినపుడు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని పేర్కొంటున్నారు. అంతేగాక జీఎస్టీ ఎగవేత, దొడ్డిదారిన విదేశీ నిధుల స్వీకరణ, వ్యక్తిగత అప్పులు ఎగ్గొట్టడం, బ్యాంకు రుణాలు చెల్లించకుండా ముఖం చాటేయడం తదితర అనేక అనుమానాస్పద వ్యవహారాల్లో బ్యాంకు ఖాతాల స్తంభనకు చట్టపరమైన ఆదేశాలు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ న్యూస్ ఛానల్ కు మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి నిర్వాహకుడు ఎటువంటి ఆర్థిక ‘దందా’లకు పాల్పడి ఉంటాడనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలోని ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించకుండా, ప్రశ్నించినవారిపై పోలీసులను రప్పించి భంగపడడడం వంటి పరిణామాల చరిత్ర గల నేపథ్యంలో తాజా ఘటన ఇంకా ఆ సంస్థలో మిగిలి ఉన్న ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు మూతపడుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లు ప్రాచుర్యంలో గల సదరు ఛానల్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఇంతకీ ఛానల్ ఎండీ పాల్పడిన ఆర్థిక నేరాల నిర్వాకమేంటనేది త్వరలోనే బహిర్గతమవుతుందనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గడచిన 20 రోజులుగా ఛానల్ ఎండీతోపాటు అతనికి సన్నిహితంగా ఉండే కీలక ఉద్యోగి ఒకరు ఛానల్ ఆఫీసు వైపు రావడం లేదని సమాచారం.

Popular Articles